మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో రూపొందిన భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది'(Peddi). జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. జూన్ 3 నుండే ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి.
వెంకట్ సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమాకి ‘మైత్రి’ నవీన్, వై రవిశంకర్..లు సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టైటిల్ గ్లిమ్ప్స్, పాటలు, ట్రైలర్ అన్నీ ఆడియన్స్ నుండి మంచి మార్కులు వేయించుకున్నాయి.
అయితే ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి :
‘ఆర్.ఆర్.ఆర్’ వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ ఎంతో కష్టపడి ‘పెద్ది’ సినిమా చేశాడు. దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథకి వంద శాతం సరెండర్ అయిపోయి ‘పెద్ది’ కోసం రెండున్నరేళ్లు సమర్పించాడు. చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డాన్స్, పెర్ఫార్మన్స్ అన్నీ సినిమాలో హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘రంగస్థలం’ లో చరణ్ నటనకి మిస్ అయిన నేషనల్ అవార్డు.. ‘పెద్ది’ తో లభిస్తుందని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతుండటం.. సినిమాపై ఆసక్తిని పెంచే అంశం.
‘పెద్ది’ సినిమా టాలీవుడ్..కి చాలా అవసరం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ తర్వాత టాలీవుడ్లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కూడా పడలేదు. కనీసం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. మరోపక్క ఐపీఎల్ మ్యాచ్..ల పుణ్యమా అని జనాలు థియేటర్లకు రావడం మానేశారు. ఈ క్రమంలో చాలా థియేటర్లు మూతబడ్డాయి. అవన్నీ ఇప్పుడు ‘పెద్ది’ తో తెరుచుకుంటున్నాయి. ‘పెద్ది’ కనుక హిట్ అయితే.. డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకు ఊరట లభించినట్టే.
డెబ్యూ మూవీని కేవలం రూ.25 కోట్ల బడ్జెట్ తో తీసిన దర్శకుడు బుచ్చిబాబు సానా.. తన రెండో సినిమాకి చరణ్ వంటి స్టార్ హీరోని, రూ.350 కోట్ల బడ్జెట్ ను ఎలా హ్యాండిల్ చేశాడు అనే అనుమానం చాలా మందిలో ఉంది. దానికి క్లారిటీ రావాలంటే ‘పెద్ది’ చూడాల్సిందే.
ఏఆర్ రెహమాన్ మంచి పాటలు ఇచ్చేసి చేతులు దులిపేసుకునే రకం కాదు. లైఫ్ టైం గుర్తుపెట్టుకునే పాటలు అందించే రకం. ‘పెద్ది’ పై అందరి దృష్టి పడేలా చేసినవి పాటలే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘చికిరి చికిరి’ ‘రై రై రారా’ వంటి పాటలు ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. విజువల్ గా కూడా వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆసక్తిని రేకెత్తించాయి.
జాన్వీ కపూర్ గ్లామర్ ‘పెద్ది’ కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్లో ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అనే ఫీల్ కలిగించింది.
జగపతి బాబు ఈ సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. కథలో కూడా అతని పాత్ర చాలా కీలకం అంటున్నారు.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్రని ట్రైలర్లో ఎక్కువగా చూపించలేదు. కానీ లుక్ మాత్రం పవర్ఫుల్ గా అనిపించింది. సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసిన అంశాల్లో ఇది కూడా ఒకటి.
‘మీర్జాపూర్’ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్న దివ్యెందు శర్మ ‘పెద్ది’లో నెగిటివ్ రోల్ పోషించాడు. అది కూడా అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసే అంశం.
రత్నవేలు సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ఈ సినిమా కోసం వేసిన సెట్స్ కూడా హైలెట్ అవుతాయి అంటున్నారు. 1970-80..లలో జరిగే కథ కాబట్టి.. అప్పటి వాతావరణాన్ని తలపించేలా సెట్స్ వేసినట్టు తెలుస్తోంది.
‘పెద్ది’ క్లైమాక్స్ గురించి సినిమా టీం అంతా స్పెషల్ గా చెబుతుంది. ఇంకో రకంగా కొంతమంది ఫాన్స్ ను టెన్షన్ పెడుతుంది అని కూడా చెప్పాలి. అది కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించే అంశం అనే చెప్పాలి.