బాహుబలి సినిమాలకు ఐదేళ్లు కేటాయించడంతో.. ప్రభాస్ జాబితాలో సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అందుకే ఒక సినిమా చేసే సమయంలోనే మరో సినిమాని పట్టాలెక్కించారు. సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి 20 వ సినిమాని మొదలు పెట్టారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న మూవీ షూటింగ్ సెప్టెంబర్ 20 నుంచి ఇటలీలో జరుగుతోంది. తొలి షెడ్యూల్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రీకరణలో తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేస్తున్నారు.
1970 నేపథ్యంలో సాగే ప్రేమకథ కాబట్టి అప్పటి కాలానికి తగ్గట్టు సెట్ వేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా ఏడుకోట్ల ఖర్చు పెడుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇటలీ షెడ్యూల్ అనంతరం ఈ సెట్ లో షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి మొదట ఫ్రెంచ్ భాషలో ‘అమూర్’ (ఫ్రెంచ్లో ప్రేమ అని అర్థం) అనే టైటిల్ను అనుకున్నారు. అయితే ఈ సినిమాకి “జాన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్. టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.