ప్రముఖ సీనియర్ నటి వాణి శ్రీ గురించి తెలియని వారుండరు. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారందరితోను జతకట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ఆమె చివరిగా నటించిన చిత్రం ‘భద్రాద్రి రాముడు’. కారణాలేంటో తెలీదు కానీ ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా… ఇటీవల ఆమె ‘మహానటి’ చిత్రం చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి గారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2018 లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఘనవిజయాన్ని నమోదుచేసింది. సినీ ప్రముఖులు అంతా ఈ చిత్రం అద్భుతమంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. అయితే వాణిశ్రీ కి మాత్రం ఈ చిత్రం నచ్చలేదంట. వాణిశ్రీ మాట్లాడుతూ… ” ‘మహానటి’ సినిమా చూస్తూ సెకండ్ హాఫ్ లో నిద్రపోయాను. సావిత్రి జీవితంలో అలాంటి సంఘటనలేవి జరగలేదు. మహానటి చిత్రం వాస్తవికతకు దూరంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేయడంతో అందరికీ షాక్ తగిలింది. ఇక మీ బయోపిక్ కూడా వెండి తెరపైకి రావాలని కోరుకుంటున్నారా అని విలేకరి ప్రశ్నించగా.. “అనూహ్యమైన మలుపులు, వివాదాలు ఉండే సెలెబ్రిటీల బియోపిక్స్ మాత్రమే ప్రేక్షకులు కోరుకుంటారు. నా జీవితంలో అలాంటి సంఘటనలేవి జరగలేదు. నా జీవితమంతా సాఫీగా సాగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ‘మహానటి’ చిత్రం పై ఈమె అలా ఎందుకు కామెంట్ చేసింది అనేది చాలా చర్చనీయాంశం అయ్యింది. ఒక వేళ ‘మహానటి’ సెకండ్ హాఫ్ అంతా కల్పితమా? లేక ‘వాణిశ్రీని అందరూ మరిచిపోయారు.. ఒకసారి గుర్తుచేద్దాం’ అని భావించి కావాలనే ఆమె ఇలా కామెంట్ చేసిందా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.