ముందుగా ఓ క్లారిటీ.. మణిరత్నం పర్యటన వ్యక్తిగతంగా కాదు. సినిమా పరంగా. సాదరంగా ఇటీవల కాలంలో విదేశాల్లో చిత్రీకరణ అన్నది సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. విదేశాల్లోని అందాలను మన ప్రేక్షకులకు చూపిద్దాం అని కొందరు, బడ్జెట్ లో రాయితీ కోసం మరికొందరు విదేశాల్లో సినిమాలు షూట్ చేసేందుకు చొరవ చూపుతుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా నిర్మాతల గోడుని పట్టించుకోకుండా తమ సరదా తీర్చుకునే బాపతు కూడా ఉన్న ఈ రోజుల్లో సినిమా చిత్రీకరణ కోసందాదాపు పదేళ్ల తర్వాత విదేశాలకు పయనమవనున్నారు మణిరత్నం.
‘ఓకే బంగారం’ సినిమా తర్వాత కార్తీ, అదితిరావు హీరో హీరోయిన్లుగా మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాట్రు వెళియిడై’. ఎనిమిది రోజుల చిత్రీకరణ మినహా సినిమా పూర్తయిందంటూ ఇటీవ కార్తీ చెప్పిన విషయం గుర్తుందిగా. చిన్నపాటి ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఓ పాట కోసం బల్గెరియా ఫ్లైట్ ఎక్కనున్నారు. అభిషేక్ బచ్చన్ హీరోగా చేసిన ‘గురు’ సినిమా కోసం చివరిసారి విదేశాలకు వెళ్లారు. తర్వాత తీసిన ‘రావణ్’ సినిమాలోని అందమైన లొకేషన్లు అన్నీ ఊటీ, ధర్మపురి వాటర్ ఫాల్స్, మహాబలేశ్వర్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించినవే. పరాజంగా మిగిలిన ‘కడల్’ సినిమా కోసం చెన్నై, కేరళ, అండమాన్ నికోబర్ దీవుల్లో పర్యటించిన మణిరత్నం ‘ఓకే బంగారం’ సినిమాని ముంబై, అహ్మదాబాద్, చెన్నై పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశారు. ‘ఓకే బంగారం’ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడం విడుదల చేసిన ఫస్ట్ లుక్ ‘కాట్రు వెళియుడై’ సినిమాపై అంచనాలను ఏర్పరిచింది. అవి అందుకుంటే మణిరత్నం అండ్ కో మరో హిట్ కొట్టినట్టే.