బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదానికి సరిగ్గా సూటయ్యే భామ అనసూయ. మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తోంది. జబర్దస్త్ షో తో దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డ ఈ సుందరి అనేక ఐటెం సాంగ్స్ ఆఫర్లు అందుకుంది. అయితే స్పెషల్ సాంగ్స్ చేస్తే అందాల ఆరబోతకే పరిమితమవుతామని భావించి సున్నితంగా తిరస్కరించింది. క్షణం సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రను అద్భుతంగా పోషించి నటిగా నిరూపించుకుంది. అలాగే రంగస్థలంలోనూ రంగమ్మత్తగా అదరగొట్టింది. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. పదికి పైగా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. అయితే వచ్చిన పాత్రలన్నీ చేసి ఉన్న క్రేజ్ ని పోగొట్టుకోవడం ఇష్టం లేక.. ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే సెలక్ట్ చేస్తోందని తెలిసింది.
ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలకే అనసూయ సైన్ చేసినట్లు సమాచారం. అందులో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) . విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించనున్న ఈ చిత్రాన్నీ దిల్ రాజు నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ ని ఖరారు చేయగా.. మరో కీలక పాత్రలో అనసూయ ని ఎంపిక చేసినట్లు సమాచారం. గ్లామరస్ గా ఉంటూనే .. హాస్యాన్ని పండించే ఈ రోల్ కి సంతోషంగా అనసూయ ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. మరో రెండు సినిమాల వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.