మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అ.. ఆ” సినిమాలో ముద్దుగా మాట్లాడి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అనుపమ పరమేశ్వరన్. సినిమాలో ఇంకాసేపు నాగవల్లి(పాత్ర పేరు) కనిపిస్తే బాగుండు అని కుర్రకారు కోరుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రేమమ్ రిమేక్ లో నటిస్తోంది. ఒరిజినల్ మలయాళం మూవీలో చేసిన పాత్రనే తెలుగులోనూ చేస్తోంది. యువ సామ్రాట్ నాగ చైతన్యతో తెరపై ప్రేమను పండించనుంది.
అయినా కొన్ని నిముషాలు మాత్రమే కనిపిస్తుంది. ఇందులోనూ ఎక్కువ సేపు అనుపమకు చూసుకోలేమా? అని నిరాశ పడే అభిమానులకు ఓ శుభవార్త. ఈ కేరళ కుట్టీ ప్రధాన కథానాయికగా ఓ తెలుగు చిత్రాన్ని చేయనుంది. శతమానం భవతి పేరుతో నిర్మాత దిల్రాజు నిర్మించనున్న సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటించనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అనుపమ అచ్చమైన పల్లెటూరి పిల్లలా అందాలను ఆరబోయనుంది. ఈ మూవీ చిత్రీకరణను వెంటనే ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు.