గత ఏడాది వచ్చిన ‘భాగమతి’ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు అనుష్క. ప్రస్తుతం కోనవెంకట్ సమర్పణలో, హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కబోయే ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది అనుష్క. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే కదంశంతో తెరెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలుకాబోతుంది. అనుష్క ప్రధాన పాత్ర పోషించబోతుండగా… కోలీవుడ్ నటుడు మాధవన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవల నిర్మాత కోన వెంకట్ విదేశాలకి వెళ్ళి కొన్ని లొకేషన్స్ ని ఫైనల్ చేశాడట. ఇందులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు కుడా ఉన్నాయని కోన వెంకట్ తెలిపాడు. కొన్ని లొకేషన్స్ లో అయితే మైనస్ డిగ్రీల చలి వుంటుందట. అంత చలిలో కూడా షూటింగులో పాల్గొనడానికి రెడీ అని అనుష్క చెప్పిందట. ‘బాహుబలి’ లాంటి చిత్రాన్నే పూర్తి చేసిన అనుష్కకి ఇది పెద్ద విషయం కాదని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ‘సైలెన్స్’ అనే పేరు పరిశీలనలో ఉంది. అంతేకాదు ఈ చిత్రంలో కొందరు హాలీవుడ్ నటులు కుడా నటించబోతున్నారని సమాచారం. బైలింగ్యుల్ మూవీ గా చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కించనున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో అనుష్కకి మంచి క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.