కమర్షియల్ గా ఆలోచిస్తూనే సమాజానికి సందేశాన్ని ఇచ్చే దర్శకుల్లో మురుగదాస్ ఒకరు. అతను తమిళంలో గజినీ, రమణ వంటి హిట్ సినిమాలు చేశారు. అలాగే తెలుగులో చిరంజీవితో స్టాలిన్ మూవీ తీశారు. రీసెంట్ గా మహేష్ బాబుతో స్పైడర్ అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించగా అది ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ హీరోగా “సర్కార్” అనే సినిమాని రూపొందించారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ప్రచారంలో భాగంగా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు ఇంటర్వ్యూ లు ఇవ్వడం సహజం. కానీ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆర్టిస్టులకు మురుగదాస్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
తన అనుమతి లేకుండా ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఎవరిచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఏ సన్నివేశం గురించి మాట్లాడినా కథ లీకై .. ఆడియన్స్ థ్రిల్ ను కోల్పోయే అవకాశం ఉంది. అందుకే మురుగుదాస్ ఇలా వార్నింగ్ ఇచ్చాడని అర్ధమవుతోంది. గతంలో మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన “కత్తి”, “తుపాకీ” చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.