ఈ ఏడాది టాలీవుడ్‌కి సంక్రాతి తర్వాత లాభాలు తెచ్చి పెట్టిన నెల ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా జులై నెలే. అంటే గత నెలలో టాలీవుడ్ జనాలు బాగానే డబ్బులు, పేరు సంపాదించారు. ఆ లెక్కన ఈ ఏడాదిలో తొలి అర్ధ భాగం తొలి నెల, రెండో అర్ధ భాగం తొలి నెల విజయాల్ని ఇచ్చాయన్నమాట. ఇప్పుడు రెండో అర్ధ భాగంలో రెండో నెల అదేనండీ ఆగస్టు నెల మొదలైపోయింది. ఈ నెలలో సౌత్ సినిమా పరిశ్రమల్లో ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఆగస్టులో సెలవులు ఎక్కువున్నాయి. లాంగ్ వీకెండ్‌లు కూడా ఉన్నాయి. దీంతో ఈ నెలలో థియేటర్లకు రావడానికి జనాలు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇదంతా తుపాన్లు, వర్షాలు లేకపోతేనే. ఆ విషయం పక్కన పెట్టి ఈ నెలలో రానున్న/ వస్తాయంటున్న సినిమాలు చూస్తే.. తొలి వారంలో వరుణ్ తేజ్ – మేర్లపాక గాంధీ ‘కొరియన్ కనకరాజు’ వస్తుంది. వరుణ్ మీద నమ్మకం లేకపోయినా.. సినిమా కాన్సెప్ట్ మీద కాస్త నమ్మకం ఉంది. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా సినిమా ‘కెజెక్యూ’ వస్తోంది.
సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు తెరకెక్కించిన హారర్ మూవీ ‘అగథ’ను రెండో వారంలోనే తీసుకొస్తున్నారు. అన్నపూర్ణ సంస్థ సమ్పరించిన ‘పళ్ళబురుసు’ ఈ వారంలోనే రానుంది. ఈ సినిమా మంచి హైపే తీసుకొచ్చారు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌తో. రవితేజ – శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమాను మూడో వారంలో తీసుకొస్తామని చెప్పారు. అయితే ఆ స్థాయిలో ఇంకా ప్రచారం షురూ చేయలేదు. వాయిదా పల్లవి ఎత్తుకుంటారేమో చూడాలి.
శర్వానంద్ – శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘భోగి’ రిలీజ్ ఆగస్టు 28 అని గతంలో చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ కాలేదు. కాబట్టి ఈ సినిమా కచ్చితం అని చెప్పలేం. సౌత్ ఇండియానే కాదు మొత్తం ఇండియా ఎదురుచూస్తున్న సినిమా ‘టాక్సిక్’ ఆగస్ట్ 26న రానుంది. గీతూ మోహన్ దాస్ – యశ్ కాంబినేషన్‌లో ఐదుగురు హీరోయిన్లతో పెద్దలకు కథ చెబుతాం అంటూ వస్తున్నారు. ఇన్ని పేరున్న, ఆసక్తి ఉన్న సినిమాలు వస్తున్నాయి. గత నెలలాగే వసూళ్ల వర్షం కురిసి డిస్టింక్షన్‌లో పాస్ అవ్వాలి మన సినిమాలు.
ఇక తమిళ సినిమా పరిశ్రమలో చూస్తే.. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజు హీరోగా నటించిన ‘డిసి’ రాబోతోంది. ఇందులో వామికా గబ్బి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. రెండో వారంలో సూర్య – వెంకీ అట్లూరి – మమితా బైజు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రాబోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. మలయాళ సినిమా పరిశ్రమ విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ ‘ఐ యాం గేమ్’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ ఈ నెలలో రానున్నాయి.