మెగాస్టార్ చిరంజీవి హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘భూలోకవీరుడు'(Bhoolokaveerudu) అనే క్రేజీ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. ‘వైజయంతీ మూవీస్’ సంస్థపై అగ్ర నిర్మాత సి. అశ్వినీదత్ ఈ క్రేజీ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకొచ్చారు. 1996వ సంవత్సరంలో జానపద/ఫాంటసీ చిత్రంగా ‘భూలోకవీరుడు’ సెట్స్ పైకి వెళ్లింది. అప్పటి స్టార్ రైటర్ సత్యానంద్ ఈ చిత్రానికి కథ అందించారు. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఒకటి, రెండు పాటలను కూడా కంపోజ్ చేశారు.
అందులో ‘చిమి చిమిలే చిమిలే’ అనే పాటని ఊటీ వంటి పరిసరాల్లో చిత్రీకరించారు. టబు ఈ చిత్రంలో చిరుకి జోడీగా ఎంపికైంది. వీరిపైనే 2 పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలని సైతం షూట్ చేశారు. అయితే అనుకోని విధంగా ఈ సినిమాకి బడ్జెట్ సమస్యలు వచ్చి పడ్డాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఇదే కాంబోతో ‘వినాలని ఉంది’ అనే చిత్రాన్ని రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మొదలుపెట్టారు. ‘చిమి చిమిలే’ పాటని ఆ సినిమాలో వాడుకొలనుకున్నారు.
కానీ రాంగోపాల్ వర్మ ఈ ప్రాజెక్టుని అర్దాంతరంగా వదిలేసి ముంబై వెళ్ళి ‘రంగీలా’ చేసుకున్నారు. ఏదేమైనా సింగీతం దర్శకత్వంలో మొదలైన క్రేజీ కాంబినేషన్ అనుకోని విధంగా ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా కనుక పూర్తయ్యి ఉంటే చిరంజీవి కెరీర్‌లో ఓ వినూత్న ప్రయోగాత్మక సినిమాగా నిలిచిపోయేది. పైగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరు- అశ్వినీదత్ కాంబోలో రావాల్సిన సినిమా పై భారీ హైప్ ఏర్పడింది.
ఒకవేళ సినిమా పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే.. బాక్సాఫీస్ వద్ద కూడా చారిత్రాత్మక ఓపెనింగ్స్ నమోదయ్యేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. విచిత్రమేమిటంటే 1999లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా ‘భూలోకవీరుడు జగదేకసుందరి’ అనే క్రేజీ టైటిల్..తో మరో సినిమా మొదలైంది. మహేష్ బాబు ఈ క్రేజీ ప్రాజెక్టుకి క్లాప్ కొట్టారు. దురదృష్టవశాత్తూ ఆ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది. అలా ‘భూలోకవీరుడు’ అనే టైటిల్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక తీరని కలగానే మిగిలిపోయింది.