బాలీవుడ్ కథానాయకుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల వ్యవహారంలో కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిజానికి టార్గెట్ సల్మాన్ ఖాన్ అని, అనుకోని పరిస్థితుల్లో టైగర్ ష్రాఫ్ టార్గెట్ అయ్యారు అని మొన్నీమధ్య పోలీసులు చెబితే.. నిన్న రణ్‌బీర్ కపూర్ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించారని షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు. దీంతో టైగర్ మీద దాడికి ప్రయత్నించిన వారి అసలు ఉద్దేశం ఏంటి? ఎవరిని టార్గెట్ చేశారు అనేది కీలకంగా మారింది.
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులకు పాల్పడిన షూటర్లు.. ముంబయిలోని బాంద్రాలో ఉన్న రణ్‌బీర్ కపూర్ నివాసం వద్ద కూడా రెక్కీ నిర్వహించారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్టోబరు 17న షూటర్లకు ఆయుధాలు వచ్చాయట. వాటిని బబిత, రాధ అనే ఇద్దరు మహిళలు అందజేశారట. వీరిద్దరినీ ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధాన సరఫరాదారుడు అని అంటున్న కునాల్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రాధ, బబితకు ఆయుధాలు అందించినట్లు చెబుతున్నారు.
నిజానికి, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తొలుత సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆయన ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు చూసి ప్లాన్ మార్చుకుందట. టైగర్ ష్రాఫ్‌కు పోలీసు భద్రత లేదని తెలుసుకున్న నిందితులు.. ప్రతి ఆదివారం ఆయన జుహులోని ఫుట్‌బాల్ మైదానానికి వస్తుంటారని తెలుసుకున్నారట. ఈ క్రమంలో ఆయన కారుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే సల్మాన్ ఖాన్‌పై దాడికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించింది. అప్పుడే ఆయనకు భద్రత పెంచారు.
తాజాగా రణ్‌బీర్‌పై దాడి చేయాలనుకున్న విషయం బయటకు రావడంతో.. బాలీవుడ్‌లో ఇంకే నటులపై బిష్ణోయ్ గ్యాంగ్ చూపు పడిందీ అనే కోణంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో ముంబయి పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇదే పరిస్థితి కొనసాగితే ముంబయి వీధుల్లో సినిమా తారలు తిరిగే పరిస్థితి ఉండదు.