బ్రహ్మానందం హోస్ట్ గా స్టాండప్ కామెడీ షో

  • August 23, 2018 / 07:36 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ రారాజు బ్రహ్మానందం. అరగుండు, ఖాన్‌దాదా, బాబీ, జిలేబీ, కిల్‌బిల్‌ పాండే, ఇన్‌స్పెక్టర్‌ పద్మనాభసింహ.. వంటి ఎన్నో వందల పాత్రల ద్వారా కొన్ని ఏళ్ళ పాటు హాస్య నటుడు బ్రహ్మానందం నవ్వించారు… నవ్విస్తున్నారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు.. రికార్డులున్నాయి. సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. కొత్త నటులు పరిశ్రమకు రావడంతో ఆయన వెండితెర నుంచి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. స్టార్ మా ఛానల్ వాళ్ళు “ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్” అనే షో ని నిర్వహించబోతున్నారు. ఈ షోలో పాల్గొనాలనుకునేవారికోసం ఒక ప్రోమోని రిలీజ్ చేశారు.

ఇందులో బ్రహ్మానందం ఎంతో ఎనర్జీతో నవ్వించే యువతీ యువకులను ఆహ్వానిస్తున్నారు. “స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు” అంటూ ప్రోమోలో ఆయన తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. షోలో ఇటువంటి పంచ్ లకు కొదవ ఉండదని స్పష్టంచేశారు. బుల్లితెరపై బ్రహ్మానందం వస్తున్నారనే సంగతి తెలుసుకొని అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మీ కామెడీని ఇక ఇంట్లోనే చూడొచ్చని సంబరపడిపోతున్నారు. ఈ షో బిగ్ బాస్ సీజన్ 2 పూర్తి అయిన తర్వాత ప్రారంభం కావచ్చని టీవీ పరిశ్రమ ప్రముఖులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus