Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సముద్రఖని (Hero)
  • లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (Heroine)
  • గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ, క్రాంతి కుమార్, బడవ గోపి (Cast)
  • రామ్ చక్రి (Director)
  • అరుణ్ రంగరాజులు (Producer)
  • రామానుజన్ (Music)
  • యువరాజ్ దక్షన్ (Cinematography)
  • జగన్ ఆర్ వి (Editor)
  • Release Date : 3 ఏప్రిల్ 2026
  • పాత్‌వే ప్రొడక్షన్స్ (Banner)

ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విలక్షణమైన పాత్రలు చేస్తూనే మరోవైపు కథాప్రాధాన్యత కలిగిన సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు సముద్రఖని. అతని నుండి ఓ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం అయితే జనాల్లో ఉంది. ‘విమానం’ ‘రామం రాఘవం’ వంటి సినిమాలు కూడా అవి నిజమే అని ప్రూవ్ చేశాయి. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘కార్మేని సెల్వం’. ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

Carmeni Selvam Movie Review

కథ: సెల్వం(సముధ్రఖని) ఓ టాక్సీ డ్రైవర్.అతని భార్య శాంతి(లక్ష్మీ ప్రియా చంద్రమౌళి) ఇడ్లీ బండి నడుపుకుంటూ కుటుంబ బాధ్యతల్లో తాను కూడా ఓ చేయి వేస్తుంది .వీరిద్దరి ప్రపంచం కొడుకు బాలు. అతని భవిష్యత్తు,సొంత ఇంటి కోసం వీళ్ళు ఖర్చులను అదుపులో పెట్టుకుని డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సెల్వం, శాంతి..ల దీన స్థితి చూసి బంధువులు అవమానిస్తారు. దీంతో సెల్వం, శాంతి..ల మధ్య గొడవ జరుగుతుంది. మరోవైపు సంపత్(గౌతమ్ వాసుదేవ్ మీనన్), దేవి(అభినయ) దంపతుల వద్ద సెల్వం డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. వారిద్దరికీ సెల్వంపై నమ్మకం ఎక్కువ. అయితే ఒకానొక సందర్భంలో సెల్వం వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. తర్వాత అతను విచ్చలవిడిగా అప్పులు చేసేస్తాడు. దీంతో కుటుంబం రోడ్డుపైకి వచ్చేసే దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత సెల్వం అప్పుల బాధ నుండి తన కుటుంబాన్ని ఎలా బయటపడేశాడు? సంపత్, దేవి దంపతులు అతనికి చేసిన సాయం ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఎప్పటిలానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ గా సముద్రఖని తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా చూస్తున్నంత సేపు చాలా మంది ప్రేక్షకులు సముద్రఖనిలో తమని తాము చూసుకుంటారు. అయితే లక్ష్మీ ప్రియా చంద్రమౌళి… సముద్రఖని కంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ అర్చనని తలపించింది. టాలీవుడ్ మేకర్స్ కూడా ఈమెను ఎక్కువ తెలుగు సినిమాల్లోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. అభినయ చేసింది తక్కువ నిడివి కలిగిన పాత్రే అయినప్పటికీ బాగానే చేసింది. మిగతా నటీనటులు ఓకె.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రామ్ చక్రి పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని.. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ‘కార్మేని సెల్వం’ని రూపొందించారు. అలాంటప్పుడు టైటిల్ కాస్త క్యాచీగా పెట్టాల్సింది. ‘కార్మేని సెల్వం’ అంటే చాలా మందికి అర్ధం కాకపోవచ్చు. కార్మేని అంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని సూచిస్తుంది. ఇక సెల్వం అంటే ఐశ్వర్యం అనే అర్ధం వస్తుంది.

లగ్జరీల కోసం మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు విచ్చలవిడిగా అప్పులు చేసేసి తర్వాత ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.. ఈజీ మనీ ఉచ్చులో పడి ఎలా నలిగిపోతున్నారు, మిడిల్ పేరెంట్స్ కి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ వంటి అంశాలను దర్శకుడు కళ్లకుకట్టినట్టు చూపించాడు. అప్పులకి మాత్రమే కాదు, మొబైల్ ఫోన్ కి కూడా ఎంత దూరంగా ఉంటే మంచిదనే విషయాన్ని దర్శకుడు సెన్సిబుల్ గా డీల్ చేశాడు. కొన్ని సంభాషణలు వెంటాడతాయి.

‘అవసరం లేని వాటికోసం అప్పు చేస్తే అవసరమైనదాన్ని దూరం పెట్టాల్సి వస్తుంది’ ‘మీలా నేను ఫోన్లలో కాపురం చేయలేను రా’ వంటి డైలాగులు హృద్యంగా అనిపిస్తాయి అలాగే ఆలోచింపజేస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. మెయిన్ పాయింట్లోకి వెళ్ళడానికి దర్శకుడు ఎక్కువ టైమే తీసుకున్నాడు. అవి ఇబ్బంది పెట్టే అంశాలే. అయితే సెకండాఫ్ మాత్రం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టే నేచురల్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగానే కుదిరాయి.

విశ్లేషణ: ‘కార్మేని సెల్వం’ నేటి మధ్యతరగతి కుటుంబాల జీవితాలకు అద్దం పట్టే కథ. అవసరానికి మించి ఖర్చులు, అవసరం లేని వాటికోసం అప్పులు చేసి ఈ ఎం ఐ..లకి బానిసలైపోకూడదు అనే సందేశంతో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందిన సినిమా.లాజిక్స్ వెతికే కామన్ ఆడియన్స్ సంగతి పక్కన పెడితే.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

ఫోకస్ పాయింట్: ఫ్యామిలీస్ కి నచ్చే సెల్వం

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus