ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘చంద్రయాన్’ సినిమా ఒకటి. దీనికి ఉన్న స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దర్శకుడు వేణు ఉడుగుల దీనికి సమర్పకుడిగా వ్యవహరించడం అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది వేణు ఉడుగుల సమర్పణలో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే ‘చంద్రయాన్’ కూడా సైలెంట్ గా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైనదో తెలుసుకుందాం రండి :
కథ: మందమర్రి అనే ఒక మారుమూల గ్రామం. ఆ ఊళ్లో శివ (శివ కుమార్ డీకొండ), రవి (రవి శివ తేజ), రాజు (వంశీధర్ గౌడ్) అనే ముగ్గురు జులాయి స్నేహితులు ఉంటారు. ఊళ్లో జనాలకు ఏదో ఒక సమస్య తీసుకురావడం వీళ్లకు అలవాటు. అందుకే వీళ్లను అందరూ ‘పనిలేని సైంటిస్టులు’ అంటుంటారు. ఒకరోజు సినిమా షూటింగ్ కోసం వాళ్ల ఊరికి వచ్చిన కొందరికి వీరు ఆశ్రయం కల్పిస్తారు. అయితే, వాళ్లు దొంగతనం చేసి పారిపోవడంతో ఆ నింద వీరిపై పడుతుంది. దీంతో వీళ్ళ తల్లిదండ్రులు ఈ ముగ్గురినీ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. ఆ తర్వాత వీళ్లు ఒక మెకానిక్ షెడ్ పెట్టుకుని, పని రాకపోయినా గూగుల్ సాయంతో వాహనాలకు రిపేర్లు చేస్తుంటారు.
అలాంటి వీరి జీవితంలోకి బిందు (స్వప్న ప్రియదర్శిని) అనే అమ్మాయి వస్తుంది. బిందును తొలిచూపులోనే ప్రేమించిన శివ.. ఆమెను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. ఇందుకు అతని స్నేహితులు కూడా సహాయం చేస్తారు. కానీ, శివ ప్రేమను బిందు రిజెక్ట్ చేస్తూ వస్తుంది. అయినా శివ వినకపోవడంతో.. చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించిన కొందరు సైంటిస్టుల పేర్లు చెప్పి, వాళ్లలా ఏదైనా సాధించి చూపించమని శివకు ఆమె ఛాలెంజ్ విసురుతుంది. దీంతో శివ రాకెట్ కనిపెట్టి చంద్రుడిపైకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. గూగుల్ సాయంతో ఒక రాకెట్‌ను కూడా తయారుచేస్తాడు. అయితే, దాని సాయంతో అతను చంద్రుడిపైకి వెళ్లగలిగాడా? ఆ రాకెట్ వల్ల అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరికి బిందు అతని ప్రేమను యాక్సెప్ట్ చేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
నటీనటుల పనితీరు: హీరోగా చేసిన శివ కుమార్ డీకొండలో కొంత ఈజ్ ఉంది. లుక్స్ కూడా ఓకే. తెలంగాణ యాసలో అతను పలికిన డైలాగులు బాగున్నాయి. కానీ వాటిలో పంచ్ లేకపోవడంతో పేల్లేదు. ముఖ్యంగా ‘పీకినవ్ తీ’ అంటూ ఫస్ట్ హాఫ్ లో ఒక 100 సార్లు పలికుంటాడు. ఆ డైలాగ్ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని గ్రామీణ యువతిగా బాగానే సెట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్ రవి శివ తేజకి చాలా గ్యాప్ తర్వాత ఎక్కువ నిడివి కలిగిన పాత్ర దొరికింది. బాగానే చేశాడు. కానీ తెలంగాణ స్లాంగ్ ఇతనికి సెట్ అవ్వలేదు. వంశీధర్ గౌడ్ బాగానే చేశాడు. కానీ అతని లుక్స్ మాత్రం ఈ సినిమాలో బాలేదు. బహుశా 4 ఏళ్ళ క్రితం అతను చేసిన సినిమా అయ్యుండొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ లోకేష్ మురుకుర్త్ ఎంతో ఎనర్జిటిక్ గా నటించాడు. బలగం సత్యనారాయణ సీరియస్ గా కనిపిస్తూనే అక్కడక్కడా నవ్వులు పూయించగలిగాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ ‘జాతి రత్నాలు’ స్టైల్లో ఒక లైన్ తీసుకున్నాడు. దానికి అర్థం పర్థం లేని సైన్స్‌ను, కామెడీని జోడించి ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు. ఫ్రెండ్స్ గ్రూప్‌తో చేయించిన కామెడీ ఏమాత్రం పండలేదు. చాలా నాసిరకంగా ఉంది. లీడ్ రోల్స్ చేసిన ముగ్గురూ టాలెంట్ ఉన్నవారే, మంచి కామెడీ టైమింగ్ ఉన్నవారే. కానీ వారితో పలికించిన ఒక్క పంచ్ కూడా నవ్వులు పూయించలేదు. పైగా వాళ్ల వన్ లైనర్స్కు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత దారుణంగా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా లెంగ్తీగా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ‘ఇంకా ఇంటర్వెల్ రాదేంటి?’ అంటూ నెత్తిన చెయ్యి వేసుకుని నిరాశతో ఎదురుచూస్తాడు ప్రేక్షకుడు.
ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ చూసే ఓపిక చాలా మందిలో ఉండదు. అంత దారుణమైన స్క్రీన్‌ప్లే ఇది. ‘నో సెన్స్ కామెడీ’ అంటూ టైటిల్స్‌లో వేసి ఆడియన్స్‌ను ముందే ప్రిపేర్ చేసినా.. వారి సహనానికి ఇది చాలా పరీక్ష పెడుతుంది. సెకండ్ హాఫ్‌లో కూడా ఎక్కడా సీరియస్ ప్లాట్ కనిపించదు. ప్రెజెంటర్ వేణు ఉడుగుల మార్క్ సెన్సిబిలిటీస్ కూడా ఈ సినిమాలో లేకపోవడం బాధాకరం. టెక్నికల్ అంశాలు చూసుకుంటే.. నిర్మాణ విలువలు చాలా దిగువ స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా డల్‌గా ఉంది. కొన్ని చోట్ల ఫ్రేమ్ ఊగిపోవడాన్ని కూడా గమనించవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఘోరంగా ఉంది. ఒక పాట మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. నిడివి 2 గంటల 17 నిమిషాలే ఉన్నప్పటికీ.. చాలా లెంగ్తీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
విశ్లేషణ: పైన చెప్పుకున్నట్టు,మేకర్స్ చెప్పినట్టు ‘చంద్రయాన్’ నాన్ సెన్స్ కామెడీతో కూడుకున్న ప్రయోగాత్మక చిత్రం. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేకపోవడం, కామిడీ వర్కౌట్ కాకపోవడంతో థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకులకి చాలా భారంగా అనిపిస్తుంది.
ఫోకస్ పాయింట్: ఫలించని ప్రయోగం
రేటింగ్: 1/5