Karate Kalyani: కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సోదాలు!

Advertisement

నటి కరాటే కళ్యాణి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్‌ఆర్‌ నగర్ పోలీసు స్టేషన్ పరిధి మోతీనగర్‌లోని రాజీవ్‌నగర్‌లో ఉన్న కరాటే కల్యాణి నివాసంలో ఈ తనిఖీలు జరిగాయి. కరాటే కళ్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు రెండు నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

నెలల వయసున్న పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో విచారణ కోసం ఆమె నివాసానికి వచ్చినట్లు చైల్డ్‌ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ లైన్ కమిటీ సభ్యులు సంతోష్, మహేష్ ఆధ్వర్యంలో కరాటే కళ్యాణి ఇంటిపై సోదాలు జరిగాయి. ఆమె ఇంట్లో ఓ చిన్నారిని గుర్తించారు అధికారులు.

ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న కరాటే కల్యాణి తల్లి, సోదరుడిని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్ అధికారులు ప్రశ్నించారు. ఓ దంపతులకు పుట్టిన మూడో ఆడబిడ్డను కల్యాణి పెంచుకుంటోందని ఆమె తల్లి విజయలక్ష్మి అధికారులకు వివరించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా పాపను తెచ్చుకున్నామని తెలిపింది.

చిన్నారిని న్యాయబద్ధంగానే దత్తత తీసుకుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. అయితే చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డితో కరాటే కళ్యాణి మధ్య వివాదం చర్చనీయాంశమైంది. శ్రీకాంత్రెడ్డి చేసే వీడియోలు అసభ్యంగా ఉండడంతో కరాటే కళ్యాణి అతడిపై దాడి చేసింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus