కొన్ని కాంబినేషన్ల గురించి పుకార్లు వస్తే.. అవి నిజం అవ్వాలని అభిమానులు దేవుడిని మొక్కేస్తుంటారు. ఎందుకంటే ఆ దర్శకుడి రాతకు, ఆ హీరో నటన కలిస్తే బాక్సాఫీసు దగ్గర రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా అని అనుకోవడమే. అలాంటి ఓ కాంబినేషన్ చిరంజీవి – వెంకీ కుడముల. దర్శకుడిగా పెద్దగా పేరు తెచ్చుకోని సమయంలోనే ఈ ఇద్దరి కాంబోకు అవకాశం ఏర్పడింది. అయితే ఏమైందో ఏమో (అప్పటికి) ఈ ప్రాజెక్ట్ అర్ధంతరంగా ఆగిపోయింది.
డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతుంది అని ప్రకటించిన ఈ సినిమా విషయంలో విషయం కథ నెరేషన్ వరకు వెళ్లింది అని మాత్రం వార్తలొచ్చాయి. ఆ తర్వాత సెకండాఫ్ విషయంలో సమస్య వచ్చి అక్కడితో ఆపేశారు అని అని వార్తలొచ్చాయి. ఇటీవల వెంకీ కుడుముల ఆ సినిమా ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు అనే విషయం క్లియర్‌గా చెప్పుకొచ్చారు. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు చిరంజీవి ఈ సినిమా గురించి అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరూ బ్యాకప్ ఇస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’ థ్యాంక్స్ మీట్‌లో ఈ మాటలు వచ్చాయి. ఆ సినిమాకు వెంకీ కుడుముల నిర్మాత. అంతా తానై చూసుకున్నారు. ఆ వేదిక మీద చిరంజీవి తిట్టు లాంటి పొగడ్త ఒకటి విసిరారు. వెంకీతో చేద్దామనుకున్న ప్రాజెక్ట్ గురించే మాట్లాడారు. అయితే ఆ సినిమా ప్రస్తావన నేరుగా తీసుకురాలేదు. ఎవరికీ తనకు తానుగా సినిమా చేయమని అడిగనని, కానీ ఈ దుర్మార్గుడిని అడిగానని వెంకీ కుడుములని చూపిస్తూ నిలదీశారు చిరంజీవి.
అయితే, ఇతను ఈ సారి వస్తే ఈసారి గేట్ తీయనని చెప్పేశారు. దానికి వెంకీ కుడుముల బదులుగా గోడ దూకి వస్తానని చెప్పడంతో అంతా నవ్వేశారు. ఇదంతా సరదాగా జరిగినా.. వెంకీ కుడుముల ఎలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారో చిరంజీవి మాటల బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక ఫ్యాక్షనిస్టు జైలు జీవితం పూర్తి చేసుకుని వచ్చాక కొత్త ప్రపంచంలో ఎలా ఇముడుతాడు అనే పాయింట్ మీద వెంకీ కుడుముల ఒక సబ్జెక్టు అనుకున్నారు. కానీ సెకండాఫ్ విషయంలో డౌట్ వచ్చి ప్రాజెక్ట్ ఆపేశారు.