‘హీరో’యిన్‌లు ఎక్కడి నుండో పుట్టుకురారు.. హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నప్పుడు దర్శక, రచయితలు చూసి ఈ కథానాయిక.. కథా‘నాయక’ అవుతుంది అనిపిస్తుంది. అప్పుడే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు వస్తాయి. వన్స్ క్లిక్ అయితే ఇకపై అలాంటి పాత్రలు వరుస కడతాయి. అలా వచ్చి లేడీ సూపర్ స్టార్ అయ్యారు విజయశాంతి, నయనతార లాంటివాళ్లు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఈ కోవలోకి వచ్చే ప్రయత్నంలోనే ఉంది సంయుక్త.
హీరోయిన్‌గా మంచి విజయం అందుకున్న సినిమాలు చేసిన సంయుక్త.. ఇప్పుడు ‘ది బ్లాక్ గోల్డ్’ సినిమాతో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. యోగేశ్ కేఎంసీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. ఈ మేరకు సినిమా టీమ్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గు గనుల కేంద్రంగా జరిగే కథ ఈ సినిమా అని సమాచారం. చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టమే ముఖ్యం అని భావించే ఒక పోలీసు ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది.
కొన్నేళ్ల క్రితం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్ సిండికేట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారట. 5 షెడ్యూల్స్‌లో 60 రోజుల్లో సినిమాను పూర్తి చేశామని టీమ్ చెప్పింది. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 10కి పైగా సెట్లు వేసి మరీ సినిమా తీశారట. రోజూ 300 మందికి పైగా ఈ సినిమా పనుల్లో ఉండి తెరకెక్కించినట్లు సినిమా టీమ్ ఆ మేకింగ్ వీడియోలో పేర్కొంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మరి అనుకున్నట్లుగానే ఆ స్థాయిలో సినిమా వస్తే మరో పాన్ ఇండియా హీరోయిన్‌ను మనం సౌత్ నుండి ఇవ్వొచ్చు.