Cobra Review: కోబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!

విక్రమ్ నటించిన తాజా చిత్రం “కోబ్రా”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. “డీమాంటే కాలనీ, అంజలి సి.బి.ఐ” చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019లో షూటింగ్ మొదలైనప్పటికీ.. కరోనా & లాక్ డౌన్ కారణంగా విడుదల లేట్ అవుతూ.. ఎట్టకేలకు నేడు విడుదలైంది. మరి విక్రమ్ ఈ చిత్రంతోనైనా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నాడో లేదో చూద్దాం..!!

కథ: స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్య కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇంటర్ పోల్ పోలీస్ అధికారి అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్)కు ఓ ఏడాది క్రితం ఇండియాలో జరిగిన ఒడిస్సా ముఖ్యమంత్రి హత్య కూడా అదే రీతిలో జరిగిందని తెలుసుకుంటాడు. ఈ రెండు హత్యల వెనుక ఉన్నది.. ఎవరు? మేథమెటీషియన్ అయిన మది (విక్రమ్)కు ఈ హత్యలకు లింక్ ఏమిటి? అనేది “కోబ్రా” కథాంశం.

నటీనటుల పనితీరు: గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ ఈ చిత్రంలోనూ ఓ 10 రకాల గెటప్పుల్లో కనిపించి అలరించాడు. అలాగే.. తన రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. నిజానికి విక్రమ్ కి ఈ తరహా పాత్రలు పోషించడం చాలా సాధారణ విషయం. అయితే.. సదరు సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం బాగుంది. అందువల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మలయాళ నటుడు రోషన్ మేథ్యూ విలన్ రోల్లో జీవించేశాడు. అతడి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగున్నప్పటికీ.. ఒక గోల్ అనేది లేకుండా సాగడంతో క్యారెక్టర్ ఆర్క్ దెబ్బతిని.. కనెక్టివిటీ మిస్ అయ్యింది.

శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షీ గోవిందరాజన్, జాన్ విజయ్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేయడం విశేషం. అతడి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. డైలాగ్ డెలివరీ కూడా పర్వాలేదు. హావభావాలతో ఎక్కువ పని లేకుండా అతడి క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేసుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అజయ్ జ్ణానముత్తు.. విక్రమ్ తో ఎలాంటి సినిమా తీయొచ్చో అలాంటి సినిమానే తీశాడు. నిజానికి ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టరైజేషన్ అపరిచితుడు చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే.. “రేసు గుర్రం” సినిమాలోని శ్రుతిహాసన్ పాత్రను కూడా గుర్తుకుతెస్తుంది. అయితే.. సదరు సన్నివేశాలను దర్శకుడు అజయ్ కంపోజ్ చేసిన విధానం, ట్విస్టులను సరైన సమయంలో ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటాయి. అయితే..

విక్రమ్ పాత్రను చాలా డీప్ గా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో రన్ టైమ్ గురించి పట్టించుకోకపోవడమే పెద్ద మైనస్ గా మారింది. చైల్డ్ హుడ్ & ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లెంగ్త్ మరీ ఎక్కువైంది. ఎడిట్ టేబుల్ దగ్గర కాస్త నిక్కచ్చిగా ఉండి ఉంటే సినిమాను కనీసం 30 నిమిషాలు కట్ చేయొచ్చు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం & నేపధ్య సంగీతం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ డిజైన్ వర్క్ బాగుంది. అయితే.. నిర్మాతలు చెబుతున్న 100 కోట్ల బడ్జెట్ అనేది మాత్రం ఎక్కడా కనిపించలేదు.

విశ్లేషణ: ప్రశాంతంగా సినిమా చూస్తున్న మీ బుర్రకు కాస్త పని పెట్టే చిత్రం “కోబ్రా”. ఊహించని ట్విస్టులు, మంచి పెర్ఫార్మెన్స్ లు ఉన్నప్పటికీ.. రన్ టైమ్ & ఎమోషనల్ ల్యాగ్ ఎక్కువవ్వడంతో హిట్ స్టేటస్ సంపాదించుకోలేక చతికిలపడినా.. విక్రమ్ అభిమానులు, సగటు సినిమా అభిమానులను ఆకట్టుకొని.. యావరేజ్ గా నిలిచింది.

రేటింగ్: 2.5/5

Share.