సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుండి ఇండియన్ సినిమాలో ఇది జరుగుతూనే ఉంది. ఇకపై జరుగుతూ ఉంటుంది కూడా. ఎందుకంటే సినిమాల్లోకి వస్తే వచ్చే గుర్తింపు వేరు. దానిని ఓట్లగా మలచుకోవడం చాలా తక్కువ మందికే సాధ్యం అవుతోంది. అలా కోలీవుడ్‌లో రీసెంట్ టైమ్స్‌లో చేసినవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తొలి ప్రయత్నంలోనే సీఎం అయిపోయారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? కోలీవుడ్‌లో మరో స్టార్ హీరో ఇలాంటి ప్రయత్నమే చేస్తారు అంటూ గత కొన్ని రోజులుగా కోడంబాక్కం వర్గాల్లోనే కాదు.. కోలీవుడ్ వర్గాల్లో కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఆ హీరో తండ్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పరిస్థితి ఇంకాస్త ఆసక్తికరంగా మార్చాయి. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్. ఆయన కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటూ మొదలైన చర్చ ‘ఉంది’ అంటూ కొనసాగుతోంది.
ధనుష్ తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడారు. ధనుష్ రాజకీయ ఎంట్రీపై కస్తూరి రాజాను ప్రశ్నించగా.. ‘ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం’ అని అన్నారు. ‘‘రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఎవరికైనా ఉంది. భవిష్యత్తులో నా కొడుకులు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా పాలిటిక్స్ ఎంచుకోవచ్చు’’ అని అన్నారాయన.
ధనుష్ వస్తాడు అనే మాట కస్తూరి రాజా చెప్పకపోయినా.. ఆ ఆలోచన లేదు అని అనలేదు. దీంతో ధనుష్ కూడా ఈ విషయంలో ఏమన్నా ఆసక్తితో ఉన్నాడా అనే డౌట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో వస్తోంది. విజయ్ రాజకీయ ప్రవేశం ముందు కూడా ఆయన తండ్రి చంద్రశేఖర్ ఇలానే కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు ధనుష్ – కస్తూరి రాజా.. విజయ్ – చంద్రశేఖర్ దారిలోనే నడుస్తున్నారా అనేది చూడాలి.