Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Advertisement

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కిచిన చిత్రం ‘పెద్ది’. జూన్‌ 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రకరకాల టాక్‌లు, రియాక్షన్స్‌ అందుకుంది. సినిమాలో రామ్‌చరణ్‌ నటనకు అవార్డులు వస్తాయి అంటూ విశ్లేషణలు కూడా వినిపించాయి. వీటి సంగతి పక్కన పెడితే మరో విషయంలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. జాన్వీ నటించిన కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మహిళలను కించపరిచేలా ఉన్నాయి అంటూ విమర్శలు వచ్చాయి. అసలు ఇలాంటి సన్నివేశాలు, డైలాగ్స్‌ ఎలా రాస్తారంటూ దర్శకుడు బుచ్చిబాబును తూర్పారపట్టేస్తున్నారు.

Buchi Babu

ఈ క్రమంలో మహిళలంటే తనకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉందంటూ దర్శకుడు బుచ్చిబాబు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ క్షమాపణ పోస్ట్‌ పెట్టారు. ‘పెద్ది’ విషయంలో అభిప్రాయాలు తెలిపిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు మా దృష్టికి వచ్చాయి. ఒక దర్శకుడిగా సినిమాతో ప్రేక్షకులను అలరించాలని, వారిలో స్ఫూర్తి నింపాలని, వారితో మమేకం కావాలని అనుకుంటాను. ఎవరినీ అసౌకర్యానికి గురిచేయాలని, అగౌరవపరచాలని చూడను. తెరపైన, తెర వెనుక మహిళలంటే ఎప్పుడూ గౌరవం ఉంది. మహిళల పాత్రలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు అని పోస్టులో రాసుకొచ్చారు.

‘పెద్ది’ సినిమాలో సన్నివేశాలు మనోభావాలు దెబ్బతీసేలా ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను అని బుచ్చిబాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. విమర్శలు వచ్చిన సన్నివేశాల్లో మార్పులు చేస్తున్నామని బుచ్చిబాబు తెలిపారు. ప్రేక్షకులు ఆదరిస్తేనే మా సినిమా ఎదుగుతుంది. అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని సున్నితమైన అంశాలపై కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పుకొచ్చారు బుచ్చిబాబు. మహిళలను శక్తిమంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి కట్టుబడి ఉన్నాం అంటూ తన తర్వాతి సినిమా విషయంలో జాగ్రత్తగా ఉంటామని చెప్పకనే చెప్పారు.

మరోవైపు ఈ సినిమాలోని ఓ ముద్దు సన్నివేశం కూడా చర్చకు దారి తీసింది. సందర్భం లేకుండా ఉద్దేశపూర్వకంగా పెట్టారంటూ ట్రోల్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ను గ్లామర్‌ వరకే పరిమితం చేశారని కూడా పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై కూడా బుచ్చిబాబు స్పందించారు. ఆ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి ఇంత ప్రతికూల స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య సరదాగా సాగే ప్రేమకథను చూపించాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఈ అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో పాత్రలు, సన్నివేశాలను మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తా అని చెప్పారు.

‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus