అక్కినేని అభిమానులకు శుభవార్త. అఖిల్ రెండో చిత్రానికి డైరక్టర్ ఫిక్స్ అయ్యాడు. గత కొంతకాలంగా రెండో సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని, ఇంకా కొందరి పేర్లు వినిపించాయి. అయితే చివరికి ఆ అవకాశం హను రాఘవపూడి అందుకున్నాడు. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ మణిరత్నంగా పేరు తెచ్చుకున్న హను “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” తో కమర్షియల్ డైరక్టర్ గా నిరూపించుకున్నాడు.
కొడుకు మొదటి సినిమా ఫెయిల్ కావడంతో కింగ్ నాగార్జున రంగంలోకి దిగి పలు కథలను విన్నారు. ఇందులో భాగంగా హను రాఘవపూడి చెప్పిన కథ ఆసక్తిగా ఉండడంతో అఖిల్ ని వినమని చెప్పారు. అతనికి కూడా స్టోరీ నచ్చడంతో ఒకే చెప్పేసారు. స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ సినిమాను కిలారు వెంకట రత్నం నిర్మించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ తొలి చిత్రం “అఖిల్” ఆశించిన ఫలితం రాక పోవడంతో ఈ యువ హీరో రెండో సినిమా ద్వారానైనా హిట్ ట్రాక్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే కథను ఓకే చెప్పడానికి పది నెలల టైమ్ తీసుకున్నాడు. యాక్షన్, లవ్ ఎంటర్ టైన్ జాన్రాలో తెరకెక్కనున్న సినిమాతో అఖిల్ తండ్రికి తగ్గ కొడుకుగా నిరూపించుకుంటాడని ఆశిద్దాం.