Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మౌళి త‌నుజ్ ప్ర‌శాంత్‌ (Hero)
  • సుస్మిత శెట్టి (Heroine)
  • అలీ, ర‌ఘుబాబు, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్‌, భ‌ద్ర‌మ్ త‌దిత‌రులు (Cast)
  • శ్రీను కంబాల‌ (Director)
  • న‌వీన్ యెర్నేని, ర‌వి శంక‌ర్‌ (Producer)
  • సింజిత్ ఎర్ర‌మిల్లి (Music)
  • సూర్య బాలాజీ (Cinematography)
  • శ్రీధ‌ర్‌ (Editor)
  • Release Date : 13th న‌వంబ‌ర్‌ 2026
  • మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (Banner)

“లిటిల్ హార్ట్స్” సినిమాతో హీరోగా తొలి అడుగులోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు యూట్యూబ‌ర్ మౌళి. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అత‌డు హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ “డీఎన్‌కే” (దొంగ నా కొడుకు). టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌డంతో ఈ వారం రిలీజైన చిన్న సినిమాల్లో డీఎన్‌కేపై మంచి బ‌జ్ నెల‌కొంది. శ్రీను కంబాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో సుస్మిత శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన “డీఎన్‌కే” ఎలా ఉంది? హీరోగా మౌళికి మ‌రో విజ‌యం ద‌క్కిందా? లేదా? అంటే?

Donga Naa Koduku Review

క‌థ‌: ఈశ్వ‌ర్ (మౌళి) బీటెక్ మ‌ధ్య‌లోనే ఆపేస్తాడు. బెట్టింగ్‌లు యాప్‌ల‌కు అల‌వాటుప‌డ‌తాడు. దొరికిన చోట‌ల్లా అప్పులు చేస్తుంటాడు. పుల్ల‌య్య (ర‌ఘుబాబు) కూతురు దీపును (సుస్మిత శెట్టి) చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. కొద్ది ప‌రిచ‌యంలోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. బెట్టింగ్ యాప్‌ల‌లో డ‌బ్బు కోసం చివ‌ర‌కు దీపు బంగారాన్ని కూడా వాడుకుంటాడు ఈశ్వ‌ర్‌. ఈ విష‌యం పుల్ల‌య్య‌కు తెలియ‌డంతో ప్రేమ పేరుతో కూతురు ద‌గ్గ‌ర తీసుకున్న ప‌ది ల‌క్ష‌ల‌ను నెల రోజుల్లోపు ఇచ్చేయాల‌ని లేదంటే చీటింగ్ కేసు పెడ‌తాన‌ని ఈశ్వ‌ర్‌ను బెదిరిస్తాడు.

దీపుకు ఇవ్వాల్సిన డ‌బ్బుతో పాటు మిగిలిన అప్పులు తీర్చేయ‌డం కోసం తండ్రి నారాయ‌ణ (అలీ) ప‌నిచేస్తున్న గుండుబాస్ జ్యూవెల్ల‌రీ స్టోర్‌లోనే త‌న స్నేహితుడితో క‌లిసి దొంగ‌త‌నం చేయాల‌ని ప్లాన్ చేస్తాడు ఈశ్వ‌ర్‌. వారి కంటే ముందే ఈ జ్యూవెల్ల‌రీ షాప్‌ను మ‌రో గ్యాంగ్ దోచేస్తుంది. కానీ ఈశ్వ‌ర్ దొంగ‌త‌నం చేశాడ‌నుకొని పోలీసుల‌తో పాటు గుండు బాస్ అత‌డి వెంట‌ప‌డ‌తారు. వారి నుంచి ఈశ్వ‌ర్ ఎలా త‌ప్పించుకున్నాడు? ఈ దొంగ‌త‌నానికి దీపు తండ్రి పుల్ల‌య్య‌కు ఉన్న సంబంధ‌మేమిటి? త‌న‌పై ప‌డిన నింద నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అస‌లైన రాబ‌రీ గ్యాంగ్‌ను ఈశ్వ‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడు? ఈశ్వ‌ర్ మంచిత‌నాన్ని దీపు అర్థం చేసుకుందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: మౌళి కామెడీ టైమింగ్ దొంగ నా కొడుకు సినిమాకు ప్ల‌స్‌పాయింట్‌గా నిలిచింది. సినిమాలో సీరియ‌స్ సిట్యూవేష‌న్‌లో అత‌డు వేసిన‌ పంచ్‌లు కొన్ని న‌వ్వించాయి. తొలి సినిమా లిటిల్ హార్ట్స్‌లో నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్న మౌళి ఇందులో మాత్రం మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నించిన‌ట్లుగా క‌నిపించింది. అత‌డి బాడీలాంగ్వేజ్‌కు ఆ సీన్లు సెట్ట‌వ్వ‌లేదు. హీరోయిన్ సుస్మిత శెట్టి ఓ పాట‌తో పాటు కొన్ని సీన్ల‌కు ప‌రిమిత‌మైంది.

త‌న యాక్టింగ్ టాలెంట్ చూపించే అవ‌కాశం ఆమెకు రాలేదు. హీరో తల్లిదండ్రులుగా అలీ, ర‌జిత అంత‌గా న‌వ్వించ‌లేక‌పోయారు. తండ్రీకొడుకుల డ్రామా చాలా ఆర్టిఫీషియ‌ల్‌గా ఉంది. భ‌ద్ర‌మ్, గుండు సుద‌ర్శ‌న్ పాత్ర‌ల‌ను క‌మెడియ‌న్లుగా చూపిస్తూ చివ‌ర‌లో ట్విస్ట్ కోసం వారిని వాడుకోవ‌డం ఓకే అనిపిస్తుంది. నంద‌గోపాల్ పోలీస్ పాత్ర‌ను ప‌వ‌ర్‌ఫుల్ అన్న‌ట్లుగా బిల్డ‌ప్‌లు ఇచ్చారు. చివ‌ర‌లో తుస్ మ‌నిపించారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: డీఎన్‌కే డైరెక్ట‌ర్ శ్రీను కంబాల గ‌తంలో చాలానే షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఆ ప్ర‌భావం ఈ సినిమాలోనూ క‌నిపించింది. తొలి సినిమా అంటే చాలా మంది ద‌ర్శ‌కులు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌ల‌తో స్క్రిప్ట్‌లు రాసుకుంటారు. డీఎన్‌కేలో రాత‌లోనే కాదు సినిమా తీయ‌డంలో కొత్త‌ద‌నం మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. క్రైమ్ స్టోరీ లాజిక్‌లెస్‌గా సాగుతుంది. కామెడీ చాలా చోట్ల తేలిపోయింది. దాంతో డీఎన్‌కే ఆడియెన్స్ ఓపిక‌కు ప‌రీక్ష‌గా మారిపోయింది.

ద‌ర్శ‌కుడి పేల‌వ‌మైన క‌థ కార‌ణంగా సాంకేతిక నిపుణులు కూడా ఏం చేయ‌లేక‌పోయారు. సింజిత్ ఎర్ర‌మిల్లి పాట‌లు, బీజీఎమ్ ,సూర్య బాలాజీ సినిమాటోగ్ర‌ఫీ మోస్తారుగానే ఉన్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ విలువ‌లు చిన్న సినిమాకు త‌గ్గ‌ట్లే ఉన్నాయి. పెద్ద సెట్స్‌, వంద‌లాది మంది ఆర్టిస్టులు, ఫారిన్ షెడ్యూల్స్ ఏం లేకుండా త‌క్కువ బ‌డ్జెట్‌లో నిర్మించారు.

విశ్లేష‌ణ‌: స్ఫూఫ్‌ల కాలం చెల్లిపోయింది. సూప‌ర్ హిట్ సినిమాల్లోని నాలుగైదు స‌న్నివేశాల‌ను పేర‌డీ చేసి సోష‌ల్ మీడియా వ‌చ్చే మీమ్స్‌ను వాడుకుంటూ ఆడియెన్స్‌ను న‌వ్విస్తే చాల‌నుకుంటే స‌రిపోదు. క‌థ లేకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసిన వృథానే. డీఎన్‌కేలో అదే జ‌రిగింది. బాల‌కృష్ణ డైలాగ్స్ నుంచి స్కంద సినిమా వ‌ర‌కు అన్ని సినిమాల‌పై డైరెక్ట‌ర్ సెటైర్లు వేశాడు. చివ‌ర‌కు ఖ‌డ్గం సినిమాలోని గోవిందా అనే పాట‌ను ఫ్రీమేక్ చేశాడు. అవేవీ డీఎన్‌కేను నిల‌బెట్ట‌లేక‌పోయాయి.

బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌…క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నంలో హీరో మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ‌టం చివ‌ర‌కు త‌న తెలివితేట‌ల‌తో వాటి బ‌య‌ట‌ప‌డ‌టం అనే కాన్సెప్ట్‌ల‌తో తెలుగులో గ‌తంలో చాలానే సినిమాలు వ‌చ్చాయి. అదే రొటీన్ ఫార్ములాతో డీఎన్‌కే మూవీ సాగుతుంది. క్రైమ్‌, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కుడు క‌న్ఫ్యూజ్ అయ్యాడు. అర్థం ప‌ర్థం లేని స‌న్నివేశాల‌తో సినిమాను నింపేశాడు.

త‌మ‌కు దొరికిన బంగారు న‌గ‌ల‌తో కూడిన బ్యాగ్‌ను హీరో అత‌డి స్నేహితుడు వ‌దిలించుకునే సీన్‌, క్లైమాక్స్ ట్రాక్ సాగ‌దీశారు. విల‌న్లు ఎవ‌ర‌నే ట్విస్ట్ రివీలైన తీరు కూడా సాదాసీదాగానే ఉంది. లిటిల్ హార్ట్స్ త‌ర్వాత త‌న‌కు వ‌చ్చిన మంచి అవ‌కాశాన్ని మౌళి, మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇచ్చిన ఛాన్స్‌ను డైరెక్ట‌ర్ శ్రీను కంబాల ఇద్ద‌రూ వాడుకోలేక‌పోయారు.

ఫోక‌స్ పాయింట్‌: న‌వ్వించ‌లేక‌పోయిన స్ఫూఫ్ కామెడీ

రేటింగ్‌: 2/5

Rating

2
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus