బిగ్‌బాస్ అంటే డ్రామా, ఎమోషన్. అందుకే చాలామందిని బిగ్‌బాస్ ప్రయాణాన్ని రోలర్ కోస్టర్ రైడ్ అంటుంటారు. ఏడుపులు, పెడబొబ్బలు, నవ్వులు, గిల్లికజ్జాలు, గిలిగింతలు, చక్కిలిగింతలు. ఈసారి కూడా అవి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నాలుగో సీజన్లో తొలి రోజే ఈ హంగామా మొదలవ్వబోతోంది. అవును బిగ్‌బాస్ ఈ సారి ఫాస్ట్‌గానే ఎమోషన్స్‌ని బయటకు తీసుకొచ్చేశాడు. ఈ రోజు విడుదలైన మూడో ప్రోమోలో ఈ విషయం తెలిసిపోయింది. బిగ్‌బాస్‌లో నామినేషన్ ప్రక్రియ అంటే చాలు… ఎక్కడలేని కోపాలు, గతంలో జరిగిన విషయాలు బయటకు వస్తాయి.
ఈ రోజు కూడా అదే జరిగినట్లుంది. సుజాత, కరాటే కళ్యాణి మధ్య హాట్ హాట్ సంభాషణ జరిగింది. నామినేషన్లో భాగంగా సుజాత… కరాటే కళ్యాణి పేరెత్తింది. ఇక చాలు ‘నన్నెందుకు పాయింటవుట్ చేస్తున్నావ్’ అంటూ కళ్యాణి రిటర్న్ మొదలుపెట్టింది. చేతులు ఊపుకోవడాలు, ముఖం విసురుకోవడాలు ఇక చెప్పక్కర్లేదు. మధ్యలో పెద్దమనిషిలా సూర్యకిరణ్ వచ్చి ‘నీకు ఇప్పుడు అంతా వివరించే టైమ్ కాదు’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకేముంది ఏడుపులు మొదలయ్యాయి.
ఓవైపు మోనాల్‌తో సుజాత తన బాధ చెబుతుంటే, మరోవైపు లాస్యతో కళ్యాణి తన కష్టం చెప్పుకుంటోంది. పనిలోపనిగా కులాయి ఓపెన్ చేసేసింది. నా నోరు పెద్దది, దేవుడు నాకలా పెద్ద నోరు ఇచ్చాడు అంటూ బోరున ఏడ్చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ అసలేం జరిగింది. విషయం చూస్తుంటే ఇదేదో భోజనం దగ్గర మొదలైన టాపిక్లా ఉంది. మధ్యలో సుజాత నా టాస్క్ విషయంలో తప్పు చెస్తే చెప్పండి అని పాయింట్ తీసింది. సూర్యకిరణ్ మధ్యలో వస్తున్నాడు. ఈ గొడవ ఒక రోజు ముచ్చటేనా, లేక ఇద్దరిలో ఒకరిని బయటకు పంపించే గొడవ అవుతుందా చూడాలి.