మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ (Peddi). మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 4న విడుదల కాబోతోంది ఈ సినిమా. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఫైట్ మాస్టర్ నభ కాంత్.. విలేకరి సమావేశంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా.. ‘పెద్ది’ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి ముఖ్యంగా బాడీ డబుల్స్, డూప్ షాట్స్ గురించి ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో వచ్చే పెద్ద సినిమాల్లో బాడీ డబుల్స్, డూప్ షాట్స్ వాడటం సర్వసాధారణం అయిపోయిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ‘పెద్ది’ సినిమాలో ఎటువంటి బాడీ డబుల్ లేదా డూప్స్ ఉండవని నభ కాంత్ స్పష్టం చేశారు. “నేను డూప్ షాట్స్‌కు పూర్తిగా వ్యతిరేకం. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము.
ప్రతి ఫైట్ రియలిస్టిక్‌గా, సహజంగా ఉంటుంది. హీరో రామ్ చరణ్ గారు కూడా ఈ విషయంలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు” అంటూ నభ కాంత్ తెలిపారు. అలాగే ఒక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ కంటికి గాయమై కుట్లు పడ్డాయట. అయినప్పటికీ తోటి ఫైటర్ ని కానీ, సెట్లో ఉన్న వారిని కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదట. పైగా తోటి ఫైటర్ బాగోగులు అడిగారట. అంతేకాదు మరుసటి రోజే షూటింగ్‌కు వచ్చేశారని నభ కాంత్ గుర్తుచేసుకున్నారు. చరణ్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుందని అభిప్రాయపడ్డారు నభ కాంత్.