ఈ మధ్య కాలంలో సర్జరీలు చేయించుకుంటున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండే నటీమణులు లక్షలు రూపాయల ఖర్చు పెట్టుకుని సర్జరీలు చేయించుకోవడానికి రెడీ అయినా.. ఎక్కడో తేడా కొట్టి.. వారి పరిస్థితి విషమిస్తుంది. మొన్నటికి మొన్న ఓ నటి సర్జరీ వికటించడంతో రూపు రేకలు లేకుండా తయారయ్యింది. అంతకు ముందు ఓ నటి ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. గతంలో కూడా ఆర్తి అగర్వాల్ వంటి పెద్ద హీరోయిన్లు బరువు తగ్గడం కోసమని, అందంగా కనిపించడం కోసం అని సర్జరీలు చేయించుకోవడానికి వెళ్తే..
ఊపిరి ఆడక చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా సరే సినీ పరిశ్రమలో రాణించాలి అంటే కచ్చితంగా సర్జరీలు చేయించుకోవాలి అన్నట్టు ఉంది పరిస్థితి. తాజాగా బ్రెజిల్ అందగత్తె.. మాజీ మిస్ బ్రెజిల్.. మోడలింగ్ రంగంలో బాగా రాణించి పలు యాడ్స్ లో నటించే అవకాశాన్ని సంపాదించుకున్న గ్లెయిసీ కొరియా సర్జరీ వికటించడంలో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన గ్లెయిసీ కొరియా 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని దక్కించుకుంది.
అటు తర్వాత మోడలింగ్ రంగంలో కూడా రాణించింది. కొన్ని యాడ్స్ నటిస్తూనే ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. అయితే ఈమె గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు ఓ సర్జరీ చేయించుకుంది. ఏప్రిల్ 4న ఈమెకు సాధారణ సర్జరీ జరిగింది.అయితే సర్జరీ వికటించడంతో.. గ్లెయిసీకి తీవ్ర రక్తస్రావం అయ్యింది. అంతేకాదు ఈమెకు గుండెపోటు కూడ వచ్చి.. కోమాలోకి వెళ్లిపోవడం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 నెలలపాటు కోమాలో ఉన్న ఈమె.. జూన్ 20న తుది శ్వాస విడిచింది. ఈమె వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం.