నెలలు నిండని శిశువు అకస్మాత్తుగా జన్మిస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుందో, కంగారు పడుతుందో.. అదే విధంగా తమ సినిమాకు సంబంధించిన విజువల్స్ రిలీజ్ కి ముందు లీకైతే అంతకుమించిన బాధతో విలవిలలాడతాడు నిర్మాత. ఇప్పుడు అల్లు అరవింద్-బన్నీ వాసుల పరిస్థితి అలానే ఉంది. పాపం సంవత్సరంపాటు కష్టపడి షూట్ చేసి, గత నెల రోజుల నుంచి ఆగస్ట్ 15న విడుదల చేయడం కోసం నానా కష్టాలు పడుతుంటే.. ఎవడో ఒక థర్డ్ పార్టీ ఎడిటర్ చాలా సింపుల్ గా సినిమాకి సంబంధించిన విజువల్స్ ని పైరసీ చేసి పాడేశాడు.
బస్ లో గీత-గోవిందం ముద్దాడుతున్న సన్నివేశాన్ని లీక్ చేయడంతో ప్రస్తుతం ఆ సన్నివేశం అన్నీ వాట్సాప్ గ్రూప్స్ మరియు సోషల్ మీడీయాల్లో హల్ చల్ చేస్తోంది. ఇంకా చాలా సన్నివేశాలు లీకైనట్లుగా సమాచారం. ఇవాళ సాయంత్రం వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్పీడ్ పెంచుదామని అల్లు అరవింద్ అండ్ టీం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలా ఈ సినిమాలోని సన్నివేశాలు లీకవ్వడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పటికైనా దర్శకనిర్మాతలు ఈ లీకులు మరియు పైరసీ విషయంలో కీలకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో సినిమా రిలీజ్ కంటే ముందే ఆన్ లైన్ లో హెచ్.డి ప్రింట్స్ లభ్యమయ్యే రోజులు పెద్ద దూరంగా లేవు.