సినిమా రిలీజ్ డేట్స్ క్లాష్ అవ్వడం లేదా ఆడియో ఫంక్షన్ డేట్స్ క్లాష్ అవ్వడం చూసి ఉంటాం. ఆ సమయాల్లో ఆయా చిత్ర దర్శకనిర్మాతలు లేదా కథానాయకులు ఫోన్ లో లేదా చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చలు జరిపి డేట్స్ క్లాష్ అవ్వకుండా వెనక్కి లేదా ముందుకు జరుపుతుంటారు. ఇలా చాలాసార్లు జరిగింది. అయితే.. ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా “టీజర్” విడుదలలో వచ్చిన క్లాష్ ను కూడా ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి సెటిల్ చేసుకొన్నారు. ఈ టీజర్ క్లాష్ కథేంట్రా అంటే.. నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న “శ్రీనివాస కళ్యాణం” టీజర్ 22వ తారీఖున విడుదల చేయాలనుకొన్నారు, అదే సమయానికి విజయ్ దేవరకొండ తాజా చిత్రమైన “గీత గోవిందం” టీజర్ ను కూడా విడుదల చేయనున్నామని ప్రకటించారు.
కానీ.. ఈ రెండు టీజర్లు ఒకేరోజు విడుదలవ్వడం వల్ల యూట్యూబ్ సర్వర్ క్రాష్ అవుతుందో లేక ఒక టీజర్ కి రావాల్సిన వ్యూస్ మరో టీజర్ కి వచ్చేసి రికార్డ్స్ విషయంలో కన్ఫ్యూజన్ వస్తుందనుకొన్నారో ఏమో తెలియదు కానీ.. “గీత గోవిందం” టీజర్ ను ఒకరోజు పోస్ట్ పోన్ చేసి.. జూలై 23న ఆ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సదరు పోస్టర్ మీద దిల్ రాజు ఫోన్ చేసి అడగడం వల్లే తేదీ మార్చామని అర్ధమోచ్చేలా కంటెంట్ పోస్ట్ చేయడం అనేది కొసమెరుపు. మరి ఈ టీజర్ క్లాష్ ల హడావుడి ఏంటో సదరు సినిమాల నిర్మాతలకే తెలియాలి.