ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. చిన్నచితకా సినిమాలే బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో ‘హైకూ’ ఒకటి. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఆపళ్ళ ఓ హీరోయిన్గా చేసిన తమిళ సినిమా ఇది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజున రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమాతో శ్రీదేవి ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతోంది? తెలుసుకుందాం రండి:
కథ: మనోహర్ అలియాస్ మనో (ఏగన్) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో అతను కొంతమంది ట్రైనీస్‌కు (ఫ్రెషర్స్) శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్యాచ్‌లో ఒక అమ్మాయి నివేద (ఫెమినా జార్జ్). ఆల్రెడీ ఆమె ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంటుంది. కానీ అతను ఈమెను ఎక్కువగా నిందిస్తూ, వేధిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఆమె తన లీడ్ అయిన మనోతో సన్నిహితంగా ఉండటం చూసి మరింతగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మనో.. నివికి ఎలా అండగా నిలబడ్డాడు? అసలు మనో గతం ఏంటి? అతను విమెన్స్ కాలేజీలో ఎందుకు గ్రాడ్యుయేషన్ చేయాల్సి వచ్చింది? అతని ప్రేయసి పవల్ కోడికి (శ్రీదేవి ఆపళ్ళ) అతను ఎందుకు దూరమయ్యాడు? చివరికి మనో, నివి జీవితాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
నటీనటుల పనితీరు: ఏగన్ మనో పాత్రలో నేచురల్‌గా కనిపించాడు. కొన్ని చోట్ల అతన్ని చూస్తే ధనుష్, ప్రదీప్ రంగనాథన్ గుర్తుకొస్తారు. కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఇతను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఫెమినా జార్జ్ చూడటానికి బాగానే ఉంది. కానీ క్లోజప్ షాట్స్‌లో డల్‌గా ఉంది. అయినప్పటికీ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. శ్రీదేవి ఆపళ్ళ ఈ సినిమాలో మరీ చిన్నపిల్లలా కనిపించింది. ‘కోర్ట్’లో అంటే టీనేజ్ అమ్మాయిగా ఆమె సెట్ అయ్యింది. కానీ ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా సెట్ అవ్వలేదు. అందుకే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కే ఈమె పాత్రను పరిమితం చేసినట్టు ఉన్నారు. బ్రిగిడ ఒక సాంగ్‌లో కనిపించింది. మిగతా నటీనటుల పాత్రలు అంతగా గుర్తుండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు యువరాజ్ చిన్నసామి తీసుకున్న పాయింట్ మంచిదే. కాకపోతే అతను తీసుకున్న పాయింట్ సినిమా క్లైమాక్స్‌లోనే వస్తుంది. అప్పటివరకు వచ్చే స్క్రీన్‌ప్లే అంతా పాత సినిమాల స్టైల్లో ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే విమెన్స్ కాలేజీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రైలర్లో కూడా ఆ ట్రాక్ పెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమా స్టార్టింగ్‌లోనే ఆ ట్రాక్ వెనుక ఉన్న రీజన్ రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎక్కడ వచ్చిందో తెలీకుండానే హీరో, ఫస్ట్ హీరోయిన్ విడిపోతారు.
ఇక సెకండ్ హీరోయిన్‌తో ప్రేమాయణం మొదలైన తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అయితే మళ్ళీ ఫస్ట్ హీరోయిన్ ట్రాక్‌ను తీసుకొచ్చి.. సినిమాకి కన్‌క్లూజన్ అయితే ఇవ్వగలిగారు. కానీ పరిస్థితి అప్పటికే చేజారిపోయింది. సెకండాఫ్‌ను కొంచెం క్రిస్పీగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. ఒక కాలేజ్, ఒక ఫ్లాట్, ఒక ఆఫీస్.. మొత్తం సింపుల్‌గానే చుట్టేశారు. కాకపోతే సెట్స్ వంటివి ఎక్కువ లేకపోవడం వల్ల కొంత ఆర్గానిక్ ఫీలింగ్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా లేదు. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే.
విశ్లేషణ: హైకూ ఇంట్రెస్టింగ్గా మొదలైనప్పటికీ.. ఆ తర్వాత కథలో కానీ, కథనంలో కానీ వేగం లేకపోవడంతో బోర్ కొట్టిస్తుంది. ఓటీటీకి వచ్చాక ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ సాయంతో ట్రై చేయొచ్చు కానీ, థియేటర్లలో ఈ సినిమాను వీక్షించడం ఇబ్బందిగానే అనిపిస్తుంది.
ఫోకస్ పాయింట్: ‘హైకూ’ ఇంత ల్యాగ్ కైకు!
రేటింగ్: 2/5