Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Advertisement

Cast & Crew

  • వెంకట్ (Hero)
  • నటాషా సింగ్ (Heroine)
  • హెబ్బా పటేల్, సలోని, వేద్విక సోనీ, సుమన్,అలీ తదితరులు (Cast)
  • రాజ్ తల్లూరి (Director)
  • డిక్కల లక్ష్మణరావ్, ప్రవీణ్ రెడ్డి వి (Producer)
  • మణిజెన్నా (Music)
  • ఆనంద్ మరుకుర్తి (Cinematography)
  • ఉప్పు మారుతీ (Editor)
  • Release Date : 15th మే 2026
  • వీ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ (Banner)

సీనియర్ నటుడు వెంకట్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ వంటి సూపర్ హిట్ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడాయన. ఆ తర్వాత ‘అన్నయ్య’ ‘ఆనందం’ ‘శివరామరాజు’ వంటి హిట్ సినిమాల్లో సెకండ్ హీరోగా కూడా నటించి మార్కెట్ ఏర్పరుచుకున్నారు.ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది సీనియర్ హీరోల్లాగే, వెంకట్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌ బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ వంటి భారీ ప్రాజెక్టులో భాగమైనప్పటికీ, ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అతను ఫుల్ లెంగ్త్ హీరోగా రూపొందిన ‘హరుడు’ చిత్రం ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా అయినా వెంకట్ సెకండ్ ఇన్నింగ్స్ కి సరైన బూస్టప్ ఇచ్చిందా? తెలుసుకుందాం రండి:

Harudu Movie Review

కథ: డిసిపి శంకర్ అలియాస్ ఎన్కౌంటర్ శంకర్ (వెంకట్) ముంబైలో తన ఎన్‌కౌంటర్లతో నేరగాళ్లకు వణుకు పుట్టించి, హైదరాబాద్‌కి ట్రాన్స్ఫర్ అవుతాడు. సిటీలో అడుగుపెట్టడమే తనదైన స్టైల్లో క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతాడు.ఎం ఎల్ ఎ వరదరాజులు (శ్రీహరి పైలా) నగరంలో ఒక బలమైన నాయకుడు. ప్రజల్లో అతనికి మంచి పేరు ఉంటుంది, అతని కోసం ప్రాణాలిచ్చే అనుచరులు ఉంటారు. ఒక గంజాయి కేసులో అరెస్టయిన అమాయక ఆటో డ్రైవర్‌ను విడిపించే క్రమంలో శంకర్, వరదరాజులు మొదటిసారి కలుస్తాడు.మరోవైపు, నిరుద్యోగులైన కొందరు విద్యార్థులు కలిసి ఒక ‘ఫుడ్ కోర్ట్’ పెట్టుకోవాలని కలలు కంటారు. ఆ పెట్టుబడి కోసం గత్యంతరం లేక యాక్సిడెంట్ అయిన కార్ల ఇంజిన్లను దొంగతనం చేసి అమ్ముతుంటారు.

కానీ ఊహించని విధంగా వారి చివరి దొంగతనంలో పోలీసులకు చిక్కుతారు. వారిని విడిపించేందుకు వరదరాజులు పోలీస్ స్టేషన్‌కు వస్తాడు.అయితే స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ విద్యార్థులపై దాడి జరుగుతుంది. ఈ దాడి చేయించింది సాక్షాత్తూ వరదరాజులే అని తెలిసి శంకర్ షాక్ తింటాడు.బయటకి మంచివాడిగా కనిపిస్తున్న వరదరాజులు వెనుక ఉన్న క్రూరమైన రాజకీయం ఏమిటి? ఆ స్టూడెంట్స్ దొంగతనం చేసిన ఇంజిన్లకి, వరదరాజులు పొలిటికల్ కెరీర్‌కి ఉన్న సంబంధం ఏంటి? శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: శంకర్ పాత్రలో వెంకట్ బాగానే సెట్ అయ్యాడు. ఇప్పటికీ ఫిట్‌గా ఉండటం వల్ల అనుకుంట ఈ పాత్రకు కరెక్ట్ ఛాయిస్ అనిపించాడు. కాకపోతే నటన పరంగా చూస్తే వెంకట్ ఇంకా అప్‌డేట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. కొన్ని డైలాగులు సెటిల్డ్‌గా పలికిన తీరు, అతని లుక్స్ బాగున్నాయి. కానీ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేటప్పుడు మాత్రం అతను చాలా ఇబ్బంది పడినట్లు కనిపిస్తుంది. ఆ సీన్స్‌లో అతని ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే అది నిజమేనని అర్థమవుతుంది. వెంకట్ సరసన నటాషా సింగ్ చేసింది. ఆమెకు లభించిన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినప్పటికీ, తన గ్లామర్‌తో పాస్ మార్కులు వేయించుకుంది. హెబ్బా పటేల్ ఇలాంటి ‘బి-గ్రేడ్’ పాత్రలను ఎందుకు ఎంచుకుంటుందో ఆమెకే తెలియాలి. శ్రీహరి పైలా విలనిజం చాలా సిల్లీగా ఉంది..కాకపోతే హీరో కంటే ఇతనికే కాస్త కాస్ట్లీ డ్రెస్సులు వేసి, అతనితో డాన్స్ కూడా చేయించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలీ కామెడీ అస్సలు పండలేదు. ఇక ఐటమ్ సాంగ్‌లో కనిపించిన సలోని కూడా తన గ్లామర్‌తో ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఏమాత్రం కొత్తదనం లేని కథ ఇది. ఇప్పటికే కొన్ని వందల కాప్ సినిమాల్లో చూసిన కథనే అటు తిప్పి ఇటు తిప్పి తీశాడు దర్శకుడు రాజ్ తళ్ళూరి. మొదటి సీన్ నుండే ఇది ‘రొటీన్ రొట్టకొట్టుడు పోలీస్ స్టోరీ’ అని ఎటువంటి ప్రేక్షకుడికైనా అర్థమైపోతుంది అనడంలో సందేహం లేదు. స్టూడెంట్స్ తో కార్ ఇంజిన్లు దొంగతనం చేయించే పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, దాని వెనుక ఉన్న ఎమోషన్ లాజికల్‌గా సెట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు మెయిన్ పాయింట్ పై ఒక క్లారిటీ రాదు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ‘ఘర్షణ’ లాంటి సినిమాలకి స్పూఫ్ లా అనిపిస్తుంది.సెకండాఫ్ ఇంకా సాగదీసినట్టు ఉంటుంది.

‘క్లైమాక్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా?’ అని ప్రేక్షకులు ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు. టెక్నికల్ గా కూడా సినిమా చాలా వీక్. కనీస స్థాయి నిర్మాణ విలువలు కూడా లేకపోవడం బాధాకరం. కొన్ని యాక్షన్ సీన్లలో హీరో గన్ తో కాలుస్తున్నా.. విలన్ గ్యాంగ్‌కు బుల్లెట్లు తగిలినట్టు ఎటువంటి ఆనవాళ్లు కనిపించవు అంటే, నిర్మాణ విలువలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ సీన్స్ అన్నీ ట్రోల్ మెటీరియల్ లా అనిపిస్తాయి. రన్ టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు ఉన్న ఏకైక పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి.

విశ్లేషణ: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకుంటున్న సీనియర్ నటులంతా రియాలిటీకి దగ్గరగా ఉంటూ, ముఖ్యంగా జెన్-జీ(Gen-Z) ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలను ఎంపికచేసుకుంటున్నారు. కానీ నటుడు వెంకట్ మాత్రం ఆ ట్రెండ్‌ను పట్టుకోలేదేమో అనిపిస్తుంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ కథ ఎంచుకున్నప్పటికీ, అది సస్పెన్స్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడినదైతే బాగుండేది. ‘హరుడు’ లాంటి అవుట్ డేటెడ్ కథను ఎంచుకుని వెంకట్ తన విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారనే చెప్పాలి.

ఫోకస్ పాయింట్: ‘హరుడు’.. భరించలేడు నరుడు

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus