అపజయాలతో సతమతవుతున్న ఎన్టీఆర్ ని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన మూవీ టెంపర్. ఇందులో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ పాత్రని వక్కంతం వంశీ సృష్టించగా.. పవర్ ఫులా గా చూపించడం పూరి జగన్నాథ్ కే సాధ్యమయింది. డైరక్టర్, రైటర్ అనుకున్నదానికంటే ఆ పాత్రను మరింత ఎనర్జీతో ఎన్టీఆర్ నటించి మెప్పించారు. ఆ పాత్ర పవర్ నచ్చి ఈ సినిమాని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ మీదకి వెళ్ళింది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది.
షూటింగుకి ముందు కథలోను, కొన్ని సన్నివేశాల్లోను మార్పులు చేద్దామని విశాల్ తో దర్శకుడు చెప్పాడట. ఇతర పాత్రలు, సన్నివేశాల విషయంలో చిన్న మార్పులు చేయడానికి విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల వారు చెప్పారు. ఎన్టీఆర్ పాత్ర విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయవద్దనీ .. ఆ సినిమాను నిలబెట్టింది ఆయన క్యారెక్టరైజేషనే అని స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకే ఆ పాత్రలో ఎటువంటి మార్పు లేకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.