ఫిదా, తొలి ప్రేమ సినిమాల విజయాలతో వరుణ్ తేజ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఘాజీ సినిమా ద్వారా పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. అంతరిక్షంలో ఈ స్టోరీ సాగనుంది. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ నటించనున్నారు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు పనిచేయనున్నట్టు తెలిసింది.
వారి సహాయంతో స్పేస్ కు సంబందించిన సన్నివేశాలను ఖచ్చితత్వంతో షూట్ చేయవచ్చని సంకల్ప్ రెడ్డి భావిస్తున్నారు. శ్రీహరి కోట నేపథ్యంలో ఉండనున్న ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం జార్జియాలో వేయబోయే ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరించనున్నారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. అయితే రొమాన్స్, డ్రీమ్ సాంగ్స్ ఉండవట. కథను నడిపించే మాంటేజ్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.