శ్రీమంతుడు సినిమాలో ‘రామరామ’ పాట అద్భుతంగా ఉంటుంది. కొరటాల శివ మరో సారి అటువంటి అద్బుతపాటని మనకి అందించబోతున్నారు. మహేష్ బాబు తో అతను చేస్తున్న రెండో మూవీ భరత్ అనే నేను టాకీ పార్ట్ పూర్తి చేసుకొని పాటల చిత్రీకరణలోకి ఎంటర్ అయింది. ఈ సినిమాలో ఉత్సవం నేపథ్యంలో వచ్చే పాట కోసం భారీ టెంపుల్ సెట్ ని వేశారు. ఇప్పటికే మొదలైన ఈ సాంగ్ షూటింగ్ లోని ఓ స్టిల్ ని ఉగాది సందర్భంగా నిన్న రిలీజ్ చేశారు. పంచెకట్టుతో మహేష్ బాబు అదరకొట్టారు. ఈ మూవీ ఫస్ట్ ఓత్, విజన్ ఆఫ్ భరత్ వీడియోలకు వచ్చిన మాదిరిగానే ఈ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ లుక్ సినిమాని చూడాలనే కోరికని పెంచింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నిర్మాత డివివి దానయ్య సాంగ్ గురించి వెల్లడించారు.
“ప్రస్తుతం మా సినిమాకు సంబంధించి ఓ పాట రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరిస్తున్నాము. భారీ టెంపుల్ సెట్‌లో 100 మంది డ్యాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్ లెవల్‌లో ఈ పాటను తెరకెక్కిస్తున్నాం. అలానే ఈ నెల 25 నుంచి స్పెయిన్‌లో చివరి షెడ్యూల్ ఉంటుంది. అనుకున్నట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాము” అని వివరించారు. తొలిసారి మహేష్ ముఖ్యమంత్రిగా చేస్తున్న ఈ సినిమాలో అతని సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.