నేనే బుర్రలేనివాడిని : కీరవాణి

  • April 4, 2017 / 09:13 AM IST

బాహుబలి తో పాటు ఎన్నో సినిమాలకు అద్భుత సంగీతాన్ని ఇచ్చిన ఎం ఎం కీరవాణి ట్వీట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తనను తాను తిట్టుకుంటూ చేసిన వ్యంగ్య ట్వీట్లు చర్చకు దారి తీశాయి. బాహుబలి 2 ప్రీ రిలీజ్ వేడుక సమయంలో ఆయన చేసిన ట్వీట్ లకు స్పందనగా తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేక వీడియో రూపొందించి రిలీజ్ చేశారు. ‘కీరవాణి చాలా మంచి మనిషి. కొత్తవారిని ప్రోత్సహిస్తారు. విశ్వనాథ్‌, దాసరి, రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశారు. అలాంటిది ఇప్పుడు దర్శకులపైనా, గీత రచయితలపైనా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’అని కామెంట్ చేశారు. అతని మాటలకు కీరవాణి కొన్ని ట్వీట్స్ ని తొలిగించినప్పటికీ వెటకారంగా మరికొన్ని ట్వీట్స్ చేశారు.

“మేమందరం ఎప్పటికీ విద్యార్థులమే. తప్పులు చేస్తుంటాం. తమ్మారెడ్డి భరద్వాజలాంటి వారు మమ్మల్ని సరిదిద్దుతుంటారు. నాకు ఇప్పుడే జ్ఞానోదయమైంది. దర్శకులందరూ గొప్పవారు, వినయ, విధేయతలు కలిగిన వారు. నేను ఎప్పటికీ బుర్రలేని వాడినే.” అంటూ ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా “తాజాగా నాకు ఎవరో నిఘంటువును పంపారు. అందులో అహంకారానికి అర్థం ఎం.ఎం.కె.(ఎం.ఎం.కీరవాణి) అని ఉంది” అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇక అనంత్ శ్రీరామ్ గురించి కూడా పోస్ట్ చేశారు. ‘గీత రచయిత అనంత శ్రీరామ్‌ సినీ పరిశ్రమ నుంచి తప్పుకుందామనుకుంటున్నాడు. డ్యూయెట్లు, ఐటెమ్‌ గీతాలు అన్నీ హీరోలు, డైరెక్టర్స్‌, సింగర్స్‌ రాసేసుకుంటున్నారట. అనంత్‌కు కేవలం దేశభక్తి గీతాలు మాత్రమే ఇస్తున్నారట. తెలుగు పాట అంపశయ్య మీద లేదు. అయినప్పటికీ అనంతశ్రీరామ్‌ మాత్రం కష్టాల్లోనే ఉన్నాడ’ని ట్వీట్‌ చేశారు. చివర్లో.. ‘ పని చేయమంటూ రాజమౌళి నాపై కోపడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఏప్రిల్‌ 28న బాహుబలి కంక్లూజన్ సినిమా విడుదల చేయాలని అనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా!” అంటూ ముగించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus