ప్రేమ కథా చిత్రాల్లో చక్కగా నటించి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటుడు నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ వైభోగమే వంటి చిత్రాలతో యువతకు చేరువయ్యాడు. ఈ యువ హీరో నటించిన “ఒక మనసు” శుక్రవారం (జూన్ 24) విడుదల కానుంది. ఈ సినిమాలో మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక కథానాయికగా వెండి తెరకు పరిచయం అవుతోంది.
ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ తాను పరిశ్రమలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. తనకంటే జూనియర్, కో ఆర్టిస్ట్ నిహారికతో నటించడానికి మొదట్లో కంగారు పడ్డానని తెలిపాడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన నటి కాబట్టి తనలో ఏదో తెలియని గౌరవం ఏర్పడిందని.. కాస్త ఆందోళన పడ్డానని వెల్లడించాడు.
కాని నిహారిక చలాకీ మాటలతో బాగా కలిసిపోయిందని, తన కంగారును పోగొట్టిందని చెప్పాడు. సినిమా గురించి చెబుతూ “ఒక మనసు కథని, పాత్రలను రామరాజు గారు చాలా చక్కగా మలిచారు. ఈ సినిమా యూత్ ని ఆకట్టుకుంటుంది. నా పాత్రకి మంచి పేరు వస్తుంది. నాకు, నిహారికకు ఈ చిత్రం విజయాన్నిస్తుంది” అని నాగ శౌర్య స్పష్టం చేసాడు.