విదేశీ బ్యూటీ అను ఇమ్యానుయేల్ నటించిన గత చిత్రాలు అజ్ఞాతవాసి, ఆక్సిజన్ రెండూ అపజయం పాలయ్యాయి. అయినా ఆమెపై క్రేజ్ తగ్గలేదు. ఆకర్షించే అందం.. ఆకట్టుకునే అభినయం ఆమెకు అభిమానులను తెచ్చి పెడుతోంది. తాజాగా ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నా పేరు సూర్య సినిమాలో బన్నీకి జోడీగా నటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీ 4 న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో ఈ బ్యూటీ జోరుగా పాల్గొంటున్నారు. సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు.
మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటని ఓ అభిమాని ప్రశ్నించగా అందుకు ఆమె ఇలా స్పందించారు. ‘‘చైనీస్, ఇటాలియన్ వంటకాలంటే బాగా ఇష్టం. ఇక్కడ గ్రిల్ చికెన్‌ను ఎక్కువగా తింటున్నాను. హోటల్స్ లో నాకు నచ్చిన ఇతర డిషెస్ ఏవీ లేవని తెలిసినప్పుడు నా మనసు ఆటోమేటిగ్గా గ్రిల్ చికెన్ వైపే వెళ్తుంది’’ అని అన్నారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగగా.. “‘నాకు నచ్చినవ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటిదాకా అలాంటి వ్యక్తి నాకు కనబడలేదు. ఒకవేళ ఎదురైతే వెంటనే అతనికి నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి నా మనసులోని మాటను చెప్పేస్తాను’’ అని అను వివరించారు. నా పేరు సూర్యతో పాటు శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోనూ అను నటిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది.