Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ర‌వితేజ‌ (Hero)
  • ప్రియా భ‌వానీ శంక‌ర్‌ (Heroine)
  • సాయికుమార్‌, ర‌మేష్ ఇందిర‌, స్వాసిక‌, బేబీ న‌క్ష‌త్ర త‌దిత‌రులు (Cast)
  • శివ నిర్వాణ‌ (Director)
  • నవీన్ యెర్నేని, వై రవిశంకర్ (Producer)
  • జీవీ ప్ర‌కాష్ కుమార్‌ (Music)
  • విష్ణు శర్మ (Cinematography)
  • ప్రవీణ్ పూడి (Editor)
  • Release Date : 21st ఆగ‌స్ట్‌ 2026
  • మైత్రీ మూవీ మేకర్స్ (Banner)

మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja) హిట్టు అందుకొని చాలా కాల‌మైంది. స‌క్సెస్ కోసం ర‌వితేజ త‌న రూటు మార్చాడు. మాస్ క‌థ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి ఇరుముడి (Irumudi) సినిమా చేశాడు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో బేబీ న‌క్ష‌త్ర కీల‌క పాత్ర పోషించింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై న‌వీన్ యెర్నేని, ర‌వి శంక‌ర్ ఇరుముడి సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఇరుముడి ఎలా ఉంది? ఈ సినిమాతో ర‌వితేజ‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Irumudi Movie Review

క‌థ‌: పొల్లూరుకు చెందిన త్రినాథ్ (Ravi Teja) ఆటో ట్రాలీ న‌డుపుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటాడు. కూతురు మ‌ణికంఠ అలియాస్ మ‌ణ‌మ్మ తో భార్య కావేరి (Priya Bhavani Shankar) లోకంగా బ‌తుకుతుంటాడు. కూతురు అంటే త్రినాథ్‌కు పంచ‌ప్రాణాలు. మ‌ణికంఠ‌ ఏది అడిగినా కాద‌న‌డు. పొల్లూరులోని ప్ర‌తి ఆడ‌పిల్ల‌లో త‌న కూతురినే చూసుకుంటాడు. వారి జోలికి ఎవ‌రూ వ‌చ్చిన తాట‌తీసేస్తుంటాడు త్రినాథ్‌. గురుస్వామి అలియాస్ గోప‌రాజును (సాయికుమార్‌) త్రినాథ్‌ త‌న తండ్రిలానే భావిస్తుంటాడు. ప్ర‌తి ఏటా గురుస్వామితో క‌లిసి అయ్య‌ప్ప మాల వేస్తుంటాడు. అయ్య‌ప్ప దీక్ష‌లో ఉండ‌గా త్రినాథ్‌ ఎవ‌రి జోలికి వెళ్ల‌డు. అది గ‌మ‌నించిన అత‌డి శ‌త్రువులు ఓ సారి త్రినాథ్ మాల‌లో ఉండ‌గా అత‌డిని చంపాల‌ని అనుకుంటారు.

అదే టైమ్‌లో త్రినాథ్ కూతురు మ‌ణికంఠ హ‌త్య‌కు గురువుతుంది. ఆమెను ఎవ‌రు చంపారు? మ‌ణికంఠ‌కు ఎర్రాజీతో (అజ‌య్ ఘోష్‌) పాటు మ‌రికొంద‌రితో ఎలాంటి విభేదాలు ఉన్నాయి? త‌న కూతురి చావుపై ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? తండ్రిలా భావించే గురుస్వామి త్రినాథ్‌కు ఎలాంటి న‌మ్మ‌క‌ద్రోహం చేశాడు? మ‌ణికంఠ చావుకు ఎమ్మెల్యే బుజ్జితో (ర‌మేష్ ఇందిర‌) పాటు స్కూల్ టీచ‌ర్ ప‌ద్మావ‌తికి (స్వాసిక‌)కు సంబంధం ఉందా? అన్న‌దే మిగిలిన క‌థ‌.

నటీనటుల పనితీరు: ర‌వితేజ అంటే మాస్ డైలాగ్స్‌, పంచ్‌లు, కామెడీ టైమింగ్ ఇవే గుర్తుస్తాయి. త‌న ఇమేజ్‌కు భిన్నంగా ఇరుముడిలో క‌నిపించాడు. కూతురే లోకంగా బ‌తికే తండ్రి పాత్ర‌లో అస‌మాన‌ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. హీరోయిజం, ఎలివేష‌న్ల‌లాంటివి లేకుండా సెటిల్డ్‌గా న‌టించాడు. న‌టుడిగా మాస్ మ‌హారాజాను కొత్త కోణంలో ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ సినిమాలో ఆవిష్క‌రించారు. కావేరిగా ప్రియా భ‌వానీ శంక‌ర్ డీ గ్లామ‌ర్ రోల్‌తో మెప్పించింది. ర‌వితేజ త‌ర్వాత ఈ సినిమాకు బేబీ న‌క్ష‌త్ర హైలైట్‌గా నిలిచింది.

ర‌వితేజ‌తో ఆమె కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు బాగున్నాయి. ర‌వితేజ‌కు వెన్నంటి ఉంటూనే అత‌డికి మోసం చేసే పాత్ర‌లో సాయికుమార్ పాత్ర‌లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగుంది. అత‌డి పాత్ర‌లో వ‌చ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ర‌మేష్ ఇందిర‌, స్వాసిక విల‌నిజం రొటీన్‌కు భిన్నంగా ఉంది. అజ‌య్ ఘోష్, కొముర‌క్క‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: తండ్రీకూతుళ్ల ఎమోష‌న్‌కు భ‌క్తి ఎలిమెంట్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. అంత‌ర్లీనంగా ఆడ‌పిల్ల‌ల పెంప‌కానికి సంబంధించిన ఓ మెసేజ్‌ను ఇచ్చాడు.

రూటెడ్‌గా ఇరుముడిని తెర‌కెక్కించ‌డం ప్ల‌స్స‌య్యింది. ఓవ‌ర్ సెంటిమెంట్ లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌ట‌మే కాకుండా క‌థ‌ను డైవ‌ర్ట్ చేసేలా కామెడీ, స్పెష‌ల్ సాంగ్స్ జోలికి పోలేదు. నిజాయితీగా తాను అనుకున్న క‌థ‌ను చెప్పాడు.

జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్‌, విష్ణుశ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. మ‌ల్లెపూల ప‌ల్ల‌కి తో పాటు అయ్య‌ప్ప స్వామి నేప‌థ్యంలో వ‌చ్చే పాట‌ల‌న్నీ భ‌క్తి ప్ర‌ధానంగా బాగున్నాయి. తండ్రీకూతుళ్ల ఎమోష‌న్స్‌ను త‌న మ్యూజిక్‌తోనే హైలైట్ చేశారు. సీలేరు అందాల‌ను కెమెరామెన్ విష్ణుశ‌ర్మ చాలా అందంగా చూపించారు. లొకేష‌న్స్ క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేశాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇరుముడి బ‌డ్జెట్ త‌క్కువే. లిమిటెడ్ బ‌డ్జెట్‌లో క్వాలిటీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

విశ్లేష‌ణ‌: ఆడ‌పిల్ల‌లను భ‌యంతో పెంచొద్దు. వారి మ‌న‌సులో ఉన్న‌ది ఏదైనా నిర్భ‌యంగా చెప్ప‌గ‌లిగేలా పెంచాల‌నే మెసేజ్‌తో ద‌ర్వ‌కుడు శివ నిర్వాణ‌ ఈ క‌థ‌ను రాసుకున్నాడు. త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువునే పిల్ల‌లు దైవంగా భావిస్తుంటారు. కానీ కొంద‌రు గురువుల త‌మ స్వార్థం కోసం పిల్ల‌ల జీవితాల‌తో ఎలా ఆడుకుంటున్నార‌న్న‌ది థ్రిల్లింగ్‌గా ఇరుముడిలో చూపించారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను చెప్పాల‌ని పిల్ల‌లు అనుకున్నా… ప‌రువు, ప్ర‌తిష్ట అంటూ త‌ల్లిదండ్రులు సొసైటీ కోసం వారి నోరును ఎలా నొక్కేస్తున్నారు, పిల్లల్లో భ‌యాల‌ను ఏ విధంగా పెంచుతున్నార‌న్న‌దే ఇరుముడి మెయిన్ స్టోరీ. ఈ పాయింట్‌ను చాలా క‌మ‌ర్షియ‌ల్‌గా చెప్పేందుకు అవ‌కాశం ఉంది. కానీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాత్రం ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ ర‌స్టిక్‌గా ఇరుముడిలో ఆవిష్క‌రించారు. ఎక్క‌డ ఆర్టిఫీషియ‌ల్ అనే ఫీల్ క‌న‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు.

తండ్రీకూతుళ్ల బంధాన్ని ఈ మ‌ధ్య కాలంలో ఇంత స‌హ‌జంగా ఏ సినిమాలో చూపించ‌లేదు. ర‌వితేజ‌, న‌క్ష‌త్ర మ‌ధ్య వ‌చ్చే ప్ర‌తి సీన్ మ‌న‌సుల‌ను క‌దిలిస్తుంది. అయ్య‌ప్ప మాల హీరో క‌నిపించే స‌న్నివేశాల‌ను క‌థ‌కు జోడించిన విధానం బాగుంది. కావాల‌నే ఇరికించిన‌ట్లుగా క‌థ‌లో అంత‌ర్భాగంగా వ‌చ్చేలా ఆ సీన్లు సాగిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా మ‌ల్లెపూల ప‌ల్ల‌కిని రియ‌ల్ సింగ‌ర్‌తోనే పాడించారు డైరెక్ట‌ర్‌. గ‌త సినిమాల అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు శివ నిర్వాణ‌. సేమ్ టైమ్ త‌న‌దైన మార్కును మిస్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు.

ఇరుముడి కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. ఈ పాయింట్‌తో గ‌తంలో చాలానే సినిమాలు వ‌చ్చాయి. ఫ‌స్ట్ హాఫ్ అస‌లు క‌థ అన్న‌దే లేకుండా కేవ‌లం ర‌వితేజ యాక్టింగ్‌తోనే ద‌ర్శ‌కుడు లాక్కొచ్చాడు. స్క్రీన్‌ప్లే ప్రెడిక్ట‌బుల్‌గా ఉంది. విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ఈజీగా గెస్ చేయ‌చ్చు.

ఇరుముడిలోని చిన్న చిన్న లోపాల‌ను ర‌వితేజ త‌న న‌ట‌న‌తో క‌వ‌ర్ చేశారు. అత‌డి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది.

ఫోక‌స్ పాయింట్‌: ఇరుముడి ర‌వితేజ న‌ట విశ్వ‌రూపాన్ని చాటిచెప్పిన మూవీ . మాస్ మ‌హారాజా ఈజ్ బ్యాక్‌.

రేటింగ్‌: 3/5

 

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus