ఏ సినిమా కూడా అనుకున్న డేట్ కంటే ఆలస్యంగా రావాలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే అన్ని సినిమాలు చెప్పిన డేట్‌కి వచ్చేస్తే, మిగిలిన సినిమాలకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముందుకెళ్లిపోతూ ఉంటుంది. ఇలా జరగడం లేదు అనే ఆ మధ్య ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే, ఇలా టైమ్‌కి రావాల్సిన సినిమాల్లో పెద్ద హీరోలు, పెద్ద దర్శకుడు, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు అయితే కచ్చితంగా ఉండాలి. అలాంటి సినిమానే ‘వారణాసి’.
మహేష్‌బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్‌గా, రాజమౌళి దర్శకుడిగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో గత కొన్ని వారాలు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానికి సారాంశం.. సినిమా సమయానికి వస్తుందా? అని.
ఈ మాట అంటే రాజమౌళి – మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కానీ.. సినిమాకు ఇప్పుడున్న టైమ్‌కి, సినిమా గురించి టీమ్ చెబుతున్న స్కేల్‌కి పొంతన కుదరడం లేదు. దానికి తోడు రాజమౌళి ప్రచారం సంగతి కూడా గుర్తొస్తుంటే ఆ డౌట్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం టెక్నికల్ అంశాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం తొలిసారి వాడుతున్న సాంకేతికతలు చాలానే ఉన్నాయి. అలాగే ఫార్మాట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఒక ఫార్మాట్‌లో సినిమాను సిద్ధం చేసి.. అన్ని ఫార్మాట్లలో రిలీజ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మొత్తంగా 15కిపైగా ఫార్మాట్లలో సినిమాను సిద్ధం చేస్తున్నారు. అందులో ఐమ్యాక్స్ కీలకం అని చెబుతున్నారు. నాణ్యత కోసం రకరకాల మార్పులతో సిద్ధం చేయాలట. దీని కోసం కనీసం నెల రోజుల ముందు సినిమా ఫైనల్ కాపీ సిద్ధం చేయాలి అంటున్నారు. ఇక 4డీఎక్స్ కోసం అయితే ఇంకొన్ని మార్పులు అవసరం.
ఈ లెక్కన ప్రచారానికి నెల, ఈ పనులకు నెల టైమ్ వదిలేస్తే జనవరి ఆఖరికి సినిమా ఫైనల్ కాపీ ఇచ్చేయాలి. నిజానికి ఇది చాలా కష్టమే. కానీ రాజమౌళికి కార్తికేయ లాంటి పెద్ద అండ ఉంది. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ మొత్తం బ్రీఫింగ్ అయిపోయిందట. కాబట్టి చెప్పిన డేట్‌కి రావడం పక్కా అంటున్నారు.