Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • NA (Hero)
  • ఐశ్వ‌ర్య రాజేష్‌ (Heroine)
  • స‌ముద్ర‌ఖ‌ని, సునీల్, నరేష్ అగస్త్య, మెర్లిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ క‌న‌కాల‌, మైమ్ గోపి, , బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు త‌దిత‌రులు (Cast)
  • గ్యారీ బీహెచ్‌ (Director)
  • తమడా, సైదీప్ రెడ్డిబొర్రా (Producer)
  • ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు (Music)
  • వంశీ ప‌చ్చిపులుసు (Cinematography)
  • గ్యారీ బీహెచ్‌ (Editor)
  • Release Date : 2rd జూలై 2026
  • తమడా మీడియా ప్రొడక్షన్స్ (Banner)

సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఇస‌క‌ప‌ట్నం (Isakapatnam) వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది ఐశ్వ‌ర్య రాజేష్‌ (Aishwarya Rajesh). పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో స‌ముద్ర‌ఖ‌ని, రాజా చెంబోలు, సుధాక‌ర్ కొమాకుల‌, న‌రేష్ అగ‌స్త్య కీల‌క పాత్ర‌లు పోషించారు. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌ను రాహుల్ త‌మ‌డా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. గురువారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉందంటే?

Isakapatnam Series Review

క‌థ‌: త‌న భార్య‌, కూతురితో క‌లిసి కూలీగా ఇస‌క‌ప‌ట్నంలో అడుగుపెడ‌తాడు నాయుడు (Samuthirakani). ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరుతెచ్చుకున్న చిన్నారావును(రాజీవ్ క‌న‌కాల‌) చంపేసి ఆ ఊరికి నాయ‌కుడిగా మార‌తాడు నాయుడు. ఇస‌క‌ప‌ట్నంలో నాయుడు చెప్పిందే వేదం. త‌నను ధిక్క‌రించిన వారిని చంపేస్తుంటాడు. తండ్రి చేసే ప‌నుల‌ను అత‌డి కూతురు భార‌తి (ఐశ్వ‌ర్య రాజేష్‌) వ్య‌తిరేకిస్తుంటుంది. నాయుడి ద‌గ్గ‌రే ప‌నిచేసే సూరిని (సుధాక‌ర్ కొమాకుల‌) భార‌తి ప్రేమిస్తుంటుంది. కానీ నాయుడు మాత్రం త‌న అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి భార‌తికి త‌న ప్ర‌త్య‌ర్థి అయిన‌ ప్ర‌తాప వ‌ర్మ‌తో (ర‌వివ‌ర్మ‌) పెళ్లి జ‌రిపిస్తాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భార‌తి భ‌ర్త‌ను చంపేస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? భార‌తి కోసం జైలుకు వెళ్లిన సూరిని నాయుడు ఎందుకు చంపాల‌ని అనుకున్నాడు? నాయుడు అక్ర‌మాల‌కు అడ్డుకుట్ట వేయాల‌ని సీఐ వ‌ర్మ (సునీల్‌) ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? అత‌డికి చిన్నారావుకు ఉన్న సంబంధం ఏమిటి? తండ్రిపై భార‌తి ప‌గ‌తో ర‌గిలిపోవ‌డానికి కార‌ణమేమిటి? నాయుడు కుర్చీపై క‌న్నేసిన శేఖ‌ర్ (రాజా చెంబోలు) ఎవ‌రు? వీరి రాజ‌కీయాల‌కు ఆటోడ్రైవ‌ర్ పెద్ద‌య్య (న‌రేష్ అగ‌స్త్య‌), అమ్మాజీ (మెర్లిన్ ఫిలిప్‌) కుటుంబం ఎలా న‌లిగిపోయింది? నాయుడు త‌ర్వాత ఇస‌క‌ప‌ట్నం భార‌తి, శేఖ‌ర్‌ల‌లో ఎవ‌రి సొంత‌మైంది? అన్న‌దే ఈ సిరీస్ మిగిలిన క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: నాయుడు పాత్ర‌కు స‌ముద్ర‌ఖ‌ని న్యాయం చేశాడు. డైలాగ్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే విల‌నిజాన్ని పండించాడు. ఐశ్వ‌ర్య రాజేష్ పాత్ర ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. పాజిటివ్‌గానే కాకుండా నెగెటివ్ షేడ్స్‌తో క‌నిపించే సీన్స్‌లో అద‌ర‌గొట్టింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా సునీల్ సీరియ‌స్ రోల్‌లో క‌నిపించాడు. ఆటోడ్రైవ‌ర్‌గా న‌రేష్ అగ‌స్త్య, బెన‌ర్జీ కొడుకుగా రాజా చెంబోలు న‌ట‌న ఓకే. ఐశ్వ‌ర్య రాజేష్‌ను ప్రేమించిన యువ‌కుడిగామాస్ పాత్ర‌లో సుధాక‌క‌ర్ కొమాకుల న‌ట‌న బాగుంది. ర‌వి వ‌ర్మ‌, శుభోద‌యం సుబ్బారావు, జ్వాలా కోటితో మిగిలిన వారు త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు. చాలా రోజుల త‌ర్వాత బెన‌ర్జీకి మంచి పాత్ర ద‌క్కింది. హ్యాపీస్ అనే త‌న‌దైన మార్క్ డైలాగ్‌తో ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: ఎడిట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా రెండు బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు గ్యారీ బీహెచ్‌. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు క‌థ‌లో స్కోప్ ఇస్తూ ఏడు ఎపిసోడ్స్‌తో ఎంగేజ్ చేశాడు. జాత‌ర ఎపిసోడ్స్‌, పెద్ద‌య్య‌, శేఖ‌ర్‌ల‌ను త‌న వైపుకు నాయుడు తిప్పుకునే స‌న్నివేశాలు ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టాయి. ఇది అన‌వ‌స‌రం అనిపించే ఒక్క సీన్ సిరీస్‌లో క‌నిపించ‌దు. అస‌లైన రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న‌ది చూపిస్తూ సురేష్ ర‌గ‌తు రాసుకున్న క‌థ బాగుంది. ఈ సిరీస్‌లో పాట‌ల‌కు చోటిచ్చారు. సాంగ్స్‌తో పాటు అవి వ‌చ్చే సంద‌ర్భాలు బాగున్నాయి. బీజీఎమ్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా సాగింది. త‌న డైలాగ్స్‌తోనే క‌థ‌లోని ప్ర‌తి ఎమోష‌న్‌ను ఎలివేట్ చేశారు స‌య్య‌ద్ తాజుద్దీన్‌. రాహుల్ త‌మ‌డా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మాణ విలువ‌లు అత్యున్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమాల‌కు మించి ఖ‌ర్చుపెట్టారు.

విశ్లేష‌ణ‌: పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌కు తండ్రీకూతుళ్ల డ్రామా, ల‌వ్‌స్టోరీ, రివేంజ్ అంశాల‌ను జోడించి డైరెక్ట‌ర్ గ్యారీ బీహెచ్ ఇస‌క‌ప‌ట్నం (Isakapatnam) వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. హీరోయిన్‌, విల‌న్ ఒకే ఫ్యామిలీలో ఉండ‌టం, తండ్రి అధికారాన్ని దెబ్బ‌కొట్ట‌డం కోసం కూతురు వేసే ఎత్తుల‌తో చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో అనే స‌స్పెన్స్‌ను క్రియేట్ చేశాడు. అదే టైమ్‌లో రాజ‌కీయ చద‌రంగంలో సామాన్యులు ఎలా బ‌ల‌వుతారు? త‌మ అధికారం కోసం నాయ‌కులు వారిని ఏ విధంగా వాడుకుంటార‌న్న‌ది సందేశాత్మ‌కంగా చూపించారు. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు రాసుకున్న ట్విస్ట్‌లు అదిరిపోతాయి. పోర్టు బ్యాక్‌డ్రాప్, పీరియాడిక‌ల్ సెట‌ప్ అన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి.

తొలి ఎపిసోడ్ పాత్ర‌ల ప‌రిచ‌యానికే వాడుకున్నారు. రెండో ఎపిసోడ్ నుంచి క‌థ ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ వైపు నాయుడు చేసే అక్ర‌మాలు, మ‌రోవైపు తండ్రికి వ్య‌తిరేకంగా భార‌తి చేసే పోరాటాన్నిచూపిస్తూ క‌థ‌ను ముందుకు న‌డిపించిన తీరు బాగుంది. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో తెలియ‌ని మ‌రో కోణాన్ని బాగా ఎలివేట్ చేశారు. ఏడు ఎపిసోడ్స్ అయినా అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ క‌లిగిస్తుంది.

తండ్రిపై భార‌తి ప‌గ‌ను పెంచుకోవ‌డానికి కార‌ణ‌మేమిట‌న్న‌ది ఇంకాస్త బ‌లంగా చెబితే బాగుండేది. ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్ట‌డానికి నాయుడు వేసే ఎత్తులు కొన్ని వాహ్ అనిపిస్తాయి. సుధాక‌ర్ కొమాకుల పాత్ర‌ను మొద‌ల‌య్యే తీరు బాగుంది. చిన్న చిన్న లోపాలు మిన‌హాయిస్తే తెలుగులో రీసెంట్ టైమ్‌లో వ‌చ్చిన బెస్ట్ సిరీస్ ఇది.

ఫోక‌స్ పాయింట్‌: ఇస‌క‌ప‌ట్నం ఎంగేజింగ్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్. ఐశ్వ‌ర్య రాజేష్, స‌ముద్ర‌ఖ‌ని పోటాపోటీ న‌ట‌న కోసం చూడొచ్చు.

రేటింగ్: 3.5/5

 

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus