ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్‌తోనే తెలుగు ప్రేక్షకుల్లో “ఇట్లు అర్జున” (Itllu Arjuna) మూవీ ఆసక్తిని రేకెత్తించింది. అనీష్ అనే కొత్త హీరో నటించిన ఈ సినిమాకు స్టార్ హీరో నాగార్జున ప్రజెంటర్‌గా వ్యవహరించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, అఖిల్‌తో పాటు పలువురు అగ్ర హీరోలు ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ చిన్న సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇట్లు అర్జున సినిమాను ఛలో, భీష్మ సినిమాల ఫేమ్ వెంకీ అట్లూరి నిర్మించారు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం థియేటర్లలో రిలీజైన “ఇట్లు అర్జున” ఎలా ఉంది? తొలి సినిమాతోనే అనీష్ హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం…
కథ: పెద్దన్న(ముఖేష్ రుషి) ఓ మాఫియా డాన్. వెయ్యి కోట్ల హవాలా మనీ డీల్ కోసం తన కొడుకు మునిని .. జైసలంపూర్ కి పంపుతాడు. ఆ డీల్ కి సంబంధించిన పెన్ డ్రైవ్, పాస్ వర్డ్ ముని తీసుకుంటుండగా అతని వద్ద నుండి గుర్తు తెలియని వ్యక్తి వాటిని దొంగిలిస్తాడు. అదే సమయంలో మునిని పెద్దన్న అనుచరుడు గౌరీ చంపేస్తాడు. పెన్ డ్రైవ్ కొట్టేసిన వ్యక్తి ఈ హత్య చేశాడని పెద్దన్నను నమ్మిస్తాడు. అనుకోకుండా ఈ గొడవలోకి మూగవాడు అయిన అర్జున్ ఎంటరవుతాడు? చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ పెరిగిన అర్జున్ పెద్దన్న అండ్ గ్యాంగ్‌ను ఎదురించి ఎలాంటి పోరాటం సాగించాడు? మాటలు రాని అర్జున్ తన ప్రేమను కీర్తికి (అనశ్వర రాజన్) ఎలా చెప్పాడు? తన కొడుకు చంపిన వారిని పెద్దన్న కనిపెట్టాడా? లేదా? అన్నదే ఇట్లు అర్జున మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: అనీష్ ఈ సినిమాతోనే హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాకే హీరోలంతా తమ టాలెంట్ మొత్తం చూపించాలని తపిస్తుంటారు. పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ డెబ్యూ మూవీలోనే మూగవాడిగా నటించి అనీష్ సాహసమే చేశాడు. డైలాగులు లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే పాత్రని నడిపించడం అన్నది చిన్న విషయం కాదు. సైన్ లాంగ్వేజ్ తో, విజిల్ తో అతను హీరోయిన్ తో కమ్యూనికేట్ అయ్యే విధానం కొత్తగా ఉంది.
అనస్వర రాజన్ కీర్తి పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. హీరోతో సమానంగా సినిమాలో ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉండటం గమనార్హం. బ్రహ్మాజీ, ముఖేష్ రుషి, గెటప్ శీను, రఘుబాబు, మైమ్ గోపి వంటి అనుభవజ్ఞులైన స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారు. వెన్నెల కిషోర్ కామెడీ బాగా పేలింది. అతడి పంచ్‌లు హిలేరియస్‌గా నవ్విస్తాయి. బ్రహ్మాజీ, గెటప్ శీను ట్రాక్ నుంచి చక్కటి ఫన్ జనరేట్ అయ్యింది. మలయాళ నటుడు కలైయరసన్ హరికృష్ణన్ విలనిజం బాగుంది. ఎలాంగో కుమారవేల్ కన్నింగ్ విలనిజం కూడా మెప్పిస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు: ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ తో ఆల్రెడీ దర్శకుడిగా తన ముద్ర వేసుకున్నాడు మహేష్ ఉప్పల. అయితే ఈ మధ్య చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఓటీటీల్లో తమ టాలెంట్ చూపిస్తున్నప్పటికీ థియేట్రికల్ సినిమాలకు వచ్చేసరికి కమర్షియల్ మీటర్స్ గ్రహించక తప్పటడుగులు వేస్తున్నారు. మహేష్ ఉప్పాల మాత్రం ఎక్కడా తడబడకుండా భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం మెచ్చుకోదగినదే. ప్రథమార్థం కామెడీ, లవ్ అంశాలతో సాఫీగా సాగిపోతుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి పూర్తిగా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పైనే ఆధారపడిపోయాడు. ఎక్కువ శాతం ఎమోషన్స్, లవ్ కంటే యాక్షన్ కే పెద్ద పీట వేశాడు.
ఈ సినిమాకు డైరెక్టర్ వెంకీ కుడుములు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. డెబ్యూ హీరోని నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. సినిమా కథ, కథనాల్లో చాలా చోట్ల వెంకీ మార్క్ కనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలో వెంకీ ఇన్‌వాల్వ్ అయినట్లుగా ఉన్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఇట్లు అర్జునకు మరో హీరో. పాటలతో మాత్రమే కాదు నేపథ్య సంగీతంతో కూడా సినిమా స్థాయిని పెంచాడు తమన్. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.
విశ్లేషణ: రాబరీ బ్యాక్ డ్రాప్ లో గతంలో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ థీమ్తో సాగే సినిమాలు ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆసక్తికరంగా ఉంటాయి. ‘ఇట్లు అర్జున’ కూడా ఆ కోవకి చెందిన సినిమానే. ఓ వైపు హీరోహీరోయిన్ల ప్రేమకథ… మరోవైపు పెద్దన్న గ్యాంగ్ అన్వేషణతో ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్‌గా నడిపించారు దర్శకుడు.లవ్ ట్రాక్ కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ వద్ద వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్‌లో సస్పెన్స్, కామెడీ రెండింటిని డైరెక్టర్ బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది.
వెయ్యి కోట్లు ఎవరికి దక్కుతాయనే క్యూరియాసిటీ చివరి వరకు మెయింటేన్ చేశాడు. డెబ్యూ హీరోతో ఎక్కువ ఫైట్లు చేయించకుండా అవసరమైన చోట్ల మాత్రమే యాక్షన్ చేయించడం.. ఆ బ్లాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయించడం మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయంగా పరిగణించాలి. మొత్తంగా ‘ఇట్లు అర్జున’ ఫక్తు కమర్షియల్ మీటర్‌లో తీసిన యాక్షన్ లవ్ స్టోరీ. అనీష్, అనస్వర యాక్టింగ్, వారి కెమిస్ట్రీ కోసమైనా థియేటర్‌లో చూడొచ్చు.
ఫోకస్ పాయింట్: కమర్షియల్ హంగులతో సాగే మూగ దొంగ ప్రేమకథ
రేటింగ్: 3/5