తల్లి శ్రీదేవిలా నటించాలనుకుంటున్న జాన్వి!

అతిలోక సుందరి  శ్రీదేవి నటించిన వసంత కోకిల సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళంలోనే కాకుండా ఈ సినిమాని “సద్మా”గా హిందీలోనూ తీశారు. ఈ చిత్రంలో మతిమరుపున్న అమ్మాయిగా శ్రీదేవి నటనకు అనేక అవార్డులు వచ్చాయి. ఆ సినిమా రీమేక్ లో నటించాలని ఉందని శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ చెప్పింది. దర్శకుడు శశాంక్ దర్శకత్వంలో జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. మరాఠిలో హిట్ అయిన సైరట్ మూవీ రీమేక్ దఢక్ లో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ సరసన నటించింది. ఈ మూవీ నేడు రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక సంగతులు చెప్పింది.

శ్రీదేవి నటించిన చిత్రాలను రీమేక్‌ చేస్తే దేనిలో నటిస్తారు? అని జాన్విని ప్రశ్నించగా ..” సద్మా’రీమేక్‌లో నటించాలని ఉంది. ఇది నాకు ఎంతో నచ్చిన సినిమా. ఎలాంటి సమయాల్లోనైనా, ఎన్నిసార్లయినా చూడాలనిపిస్తుంది. నేను ఇప్పటివరకు చూసిన చిత్రాల్లో ఇదే ఉత్తమ చిత్రం. అవకాశం వస్తే సద్మాలో అమ్మ పోషించిన పాత్రలో నటిస్తా.  ఒకవేళ పాత్రలు మార్చితే కమల్‌ సర్‌ పాత్ర అయినా ఓకే” అని వెల్లడించింది. ఆ సినిమా రీమేక్ చేస్తే.. తెలుగు, తమిళం, హిందీ భాషలో ఘనవిజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus