Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజ‌య్ సేతుప‌తి (Hero)
  • NA (Heroine)
  • మిళింద్ సోమ‌న్‌, సుదేవ్ నాయ‌ర్‌, వీజే పార్వ‌తి, రిచా జాక‌బ్ త‌దిత‌రులు (Cast)
  • మ‌ణికంద‌న్‌ (Director)
  • విజ‌య్ సేతుప‌తి (Producer)
  • రాజేష్ మురుగేశ‌న్‌ (Music)
  • మ‌ధు నీల‌కంద‌న్‌, ష‌ణ్ముగ సుంద‌రం (Cinematography)
  • ష‌ణ్ముగ సుంద‌రం (Editor)
  • Release Date : 27th మార్చి 2026
  • జియో హాట్ స్టార్‌ (Banner)

కోలీవుడ్‌లో వెర్స‌టైల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజ‌య్ సేతుప‌తి. క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌తి సినిమాలో ప్ర‌యోగాలు చేస్తుంటారు. ఆ వైవిధ్య‌తే అత‌డికి ద‌క్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. తాజాగా కాట్టాన్ అనే వెబ్‌సిరీస్‌తో శుక్ర‌వారం ఆడియెన్స్ ముందుకొచ్చారు విజ‌య్ సేతుప‌తి. రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా డ్రామాగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జియో హాట్‌స్టార్‌లో రిలీజైన కాట్టాన్ వెబ్‌సిరీస్‌ను విజ‌య్ సేతుప‌తి స్వ‌యంగా నిర్మించారు. తెలుగులో రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉంది? ఈ వెబ్‌సిరీస్‌తో విజ‌య్ సేతుప‌తి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా? అంటే?

Kaattaan Review

క‌థ‌: అడ‌వికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఊరిలోని పోలీస్ స్టేష‌న్‌లో మూడేళ్లుగా ఒక్క కేసు న‌మోదు కాదు. దాంతో పోలీస్ స్టేష‌న్‌ను అక్క‌డి నుంచి ఎత్తేయాల‌ని అధికారులు నిర్ణ‌యించుకుంటారు. ఆ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేసే కాళి పాండియ‌న్ అదే ఊరు. స్టేష‌న్‌ను ఎత్తేస్తే త‌ను మ‌రో ఊరికి ట్రాన్స్‌ఫ‌ర్ కావాల్సివ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ‌తాడు. మొండెం లేని త‌ల ఒక‌టి ఆ ఊళ్లో దొరుకుతుంది. ఈ కేసును ఎస్ఐతో పాటు కాళిపాండియ‌న్ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారి అన్వేష‌ణ‌లో చ‌నిపోయిన వ్య‌క్తి పేరు ముత్తు అలియాస్ కాట్ట‌న్ ( విజ‌య్ సేతుప‌తి) అని నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ముత్తు గురించి ఒక్కొక్క‌రు ఒక్కో క‌థ చెబుతారు. ముత్తుకు కేర‌ళ మినిస్ట‌ర్ బెన్నీ, గ్యాంగ్‌స్ట‌ర్ శివ‌న్న‌తో (మిళింద్ సోమ‌న్‌)ఉన్న సంబంధం ఏమిటి? ముత్తు పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డిన సింధు ఎలా చ‌నిపోయింది? ముత్తు లైఫ్‌లోకి వ‌చ్చిన మీనా ఎవ‌రు? జానీ (సుదేవ్ నాయ‌ర్‌) అనే వ్య‌క్తితో పాటు ఓ జాత‌ర‌లో జ‌రిగిన జంట హ‌త్య‌ల‌కు ముత్తుకు ఎలాంటి సంబంధం ఉంది? ముత్తు మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్ట‌రీని ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కాళి పాండియ‌న్ క‌నిపెట్టారా? కాళి పాండియ‌న్ ఇంట్లో ప‌నిచేసే క‌రుప్పు ఎవ‌రు అన్న‌దే ఈ వెబ్ సిరీస్ క‌థ‌.

విశ్లేష‌ణ‌: ఓటీటీ రాక‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌ల విష‌యంలో ఆడియెన్స్ అభిరుచులు చాలా మారిపోయాయి. రెగ్యుల‌ర్ క‌థ‌లు జెన్‌జీ ప్రేక్ష‌కుల‌కు ఆన‌డం లేదు. ఓటీటీ సినిమా అయినా కొత్త‌గా చెప్సాల్సిందే. లేదంటే నిర్మొహ‌మాటంగా స్కిప్ చేస్తున్నారు. వెబ్‌సిరీస్‌లు అయినా కూడా రేసీ స్క్రీన్‌ప్లే, ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో చివ‌రి వ‌ర‌కు ఎంగేజింగ్‌గా సాగాల్సిందే. అలాంటి వాటినే ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ స్పీడు యుగంలో కాట్టాన్ లాంటి స్లో ఫేజ్‌ సిరీస్ ఆక‌ట్టుకోవ‌డం కొంత వ‌ర‌కు క‌ష్ట‌మే.

మొత్తం ప‌ది ఎపిసోడ్స్‌తో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ మ‌ణికంద‌న్ కాట్టాన్‌ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక రెగ్యుల‌ర్ రివేంజ్ క‌థ‌నే. నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే తో ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కాట్టాన్ క‌థ ఎక్క‌డైతే మొద‌ల‌వుతుందో…అదే ప్లేస్‌లో దానికి ఓ కంక్లూజ‌న్ ఇచ్చి ఎండ్ చేయ‌డం బాగుంది.

ముత్తు అనే వ్య‌క్తి జీవితం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. అత‌డి లైఫ్‌లోకి భిన్న నేప‌థ్యాలు క‌లిగిన వారు ఎలా వ‌చ్చారు? ముత్తు గురించి వారంతా చెప్పిన ఒక్కొక్క క‌థ‌తో ల‌వ్‌, ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, రివేంజ్ అంశాల‌తో ఈ సిరీస్‌ను చివ‌రి వ‌ర‌కు న‌డిపించారు ద‌ర్శ‌కుడు.

కానిస్టేబుల్ కాళి పాండియ‌న్‌ ఫ్యామిలీని ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాల‌తో సిరీస్ మొద‌ల‌వుతుంది. ఈ సీన్స్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతాయి. ఎప్పుడైతే ముత్తు త‌ల పోలీసుల‌కు దొరుకుతుందో అక్క‌డి నుంచే అస‌లు స్టోరీలోకి ఎంట‌ర‌య్యారు డైరెక్ట‌ర్‌. ముత్తు గురించి పోలీసులు ఒక్కో క్లూ సేక‌రించే స‌న్నివేశాలు, ఈ క్ర‌మంలో రివీల‌య్యే ట్విస్ట్‌లు ఆక‌ట్టుకుంటాయి. అస‌లు ముత్తు ఎవ‌రు? ర‌క‌ర‌కాల వృత్తులు ఎందుకు చేశాడు? అత‌డు ఎవ‌రి కోసం వెతుకుతున్నాడు అనే స‌స్పెన్స్‌ను చివ‌రి వ‌ర‌కు మెయింటేన్ చేశాడు డైరెక్ట‌ర్‌. చివ‌ర‌కు కాళి పాండియ‌న్ ఊరిలోనే అత‌డు ఎందుకు చ‌నిపోయాడ‌న్న‌ది క‌న్వీన్సింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. రెండో పార్ట్ కోసం ఎలాంటి లీడ్ ఇవ్వ‌కుండా ముగించారు.

సిరీస్ కాన్సెప్ట్ బాగున్నా సాగ‌తీత ఎక్కువైంది. ప్ర‌తి పాత్ర గురించి డీటైలింగ్‌గా చెప్పే క్ర‌మంలో డైరెక్ట‌ర్ టైమ్ ఎక్కువే తీసుకున్నారు. ప‌ది కాకుండా ఐదారు ఎపిసోడ్స్‌కు కుదిస్తే బాగుండేది. కొత్త క్యారెక్ట‌ర్ ఎంట‌రైన ప్ర‌తిసారి ఏదో జ‌రుగ‌బోతుంది అనే స‌స్పెన్స్ ఎదురుచూడ‌టం చివ‌ర‌కు నిరాశ‌ప‌చెండం…చివ‌రి వ‌ర‌కు ఇలాగే సాగుతుంది. మీనా, సింధుల‌తో ముత్తు ల‌వ్‌స్టోరీస్ రొటీన్‌గానే అనిపిస్తాయి. జాత‌ర నేప‌థ్యంలో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ మాత్రం సినిమాను త‌ల‌పించింది. బెన్నీ, శివ‌న్న‌ల‌తో ముత్తు సంబంధాన్ని ఇంకాస్త థ్రిల్లింగ్ రాసుకుంటే బాగుండేది. చాలా వ‌ర‌కు డైలాగ్స్‌తోనే వారి ఫ్లాష్‌బ్యాక్‌ను స‌రిపెట్టేశారు.

న‌టీన‌టుల ప‌నితీరు: కాట్టాన్ వెబ్‌సిరీస్ విజ‌య్ సేతుప‌తి వ‌న్ మెన్ షోగా నిలిచింది. ఫ‌స్ట్ ఎపిసోడ్ మిన‌హా మిగిలిన అన్నింటిలో ప్ర‌తి సీన్‌లో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తాడు. ప్రేమికుడిగా, ప్ర‌తీకారంతో ర‌గిలిపోయే వ్య‌క్తిగా.. డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో మెప్పించాడు. క్యారెక్ట‌ర్ ప‌రంగా అత‌డు చూపించిన వేరియేష‌న్స్ బాగున్నాయి. మిలింద్ సోమ‌న్‌, సుదేవ్ నాయ‌ర్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త‌లేదు. విజ‌య్‌సేతుప‌తిని ప్రియురాళ్లుగా వీజే పార్వ‌తి, రిచా జాక‌బ్ నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. కాళి పాండియ‌న్ కామెడీ టైమింగ్ బాగుంది.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: కాట్టాన్‌లో హీరోగా న‌టిస్తూనే ఈ సిరీస్‌కు నిర్మాత‌గా విజ‌య్ సేతుప‌తి వ్య‌వ‌హ‌రించాడు. ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో ఎక్క‌డ రాజీప‌డ‌లేదు. సినిమాకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా మేకింగ్ వాల్యూస్ ఉన్నాయి.. మ‌ణికంద‌న్ క‌థ బాగున్నా స్క్రీన్‌ప్లేలో మాత్రం మెరుపులు మిస్స‌య్యాయి. సినిమా మాదిరిగానే విజ‌య్ సేతుప‌తికి వ‌చ్చిన ఎలివేష‌న్లు, వాటిలో రాజేష్ మురుగేష‌న్ బీజీఎమ్ అదిరిపోయాయి. రెండు, మూడు పాట‌లు పెట్టారు.

ఫోక‌స్ పాయింట్‌: విజ‌య్ సేతుప‌తి ఫ్యాన్స్‌ను మాత్ర‌మే మెప్పించే సిరీస్ ఇది. సాగ‌తీత విష‌యంలో కాట్టాన్‌ సీరియ‌ల్‌నే మించిపోయింది.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus