టాలీవుడ్ సీనియర్ నటులలో కైకాల సత్యనారాయణ అగ్రస్థానంలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వయసు మీద పడటంతో ఆయనకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. కానీ అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో… చిన్న పాత్రలు చేస్తూ మెరుస్తూనేవున్నారు. ఈఏడాది వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘మహర్షి’ చిత్రాల్లో కాసేపు కనిపించి సందడి చేశారు. అప్పట్లో తిరుగులేని విలన్ గానూ .. క్యారెక్టర్ ఆర్టిస్టుగాను ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు కైకాల సత్యనారాయణ. ఒకానొక దశలో హీరోగా అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ తో సమానంగా పారితోషికం తీసుకునేవారట కైకాల సత్యనారాయణ.
తాజాగా ఆయనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సంగతుల్ని తెలిపారు. కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. “అప్పట్లో విలన్ గా చాలా సినిమాలు చేశాను . ఆ పాత్రల్లో ఆడవాళ్ళను హింసించేవి కూడా వున్నాయి. దాంతో ఆడవాళ్ళకు నా పై చాలా కోపం ఉండేది. ఒకవిధంగా చెప్పాలంటే నా పై పగబట్టేశారు. ఓసారి.. పబ్లిక్ ఫంక్షన్ కి వెళితే ఒకావిడ ‘ఈ సత్తిగాడిని వెనుక నుండీ పొడిచేయాలి’ అంది. మరొకావిడ ‘ఆడపిల్ల జీవితాలను ఎందుకయ్యా అట్లా నాశనం చేస్తావు .. నీకు అక్కా చెల్లెళ్ళు లేరా?’ అని అడిగింది. నన్ను సినిమాల్లోనే కాదు బయట కూడా విలన్ లానే చూసే వారు. అయితే ఒక విలన్ ను ప్రేక్షకులు తిట్టుకుంటే అతను ఆ పాత్రను బాగా చేసినట్టే…! అందుకే వాళ్ళు అలా అన్నారు. దానికి నేనేమి బాధపడలేదు. నవ్వుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.