టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న నందమూరి హీరో మరియు నిర్మాత కళ్యాణ్ రామ్. ఆయన కెరీర్‌లో ‘బింబిసార’ చిత్రం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విభిన్న కథలపై ఆసక్తి చూపే కళ్యాణ్ రామ్, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలోనూ ముందుంటారు. గతంలో ఆయన పరిచయం చేసిన దర్శకులు మంచి హిట్లు అందుకోవడం విశేషం. సురేందర్ రెడ్డి తో ‘అతనొక్కడే’, దర్శకుడు అనిల్ రావిపూడితో ‘పటాస్’ , కె.వి. గుహన్ తో ‘118’ , దర్శకుడు వశిష్ట తో ‘బింబిసార’ వంటి చిత్రాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
2022 విడుదలైన ‘బింబిసార’ పీరియాడిక్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం సాధించింది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజు కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, సీక్వెల్‌పై భారీ అంచనాలు పెంచింది. అయితే సినిమా వచ్చి నాలుగేళ్లకు దగ్గరవుతున్నా బింబిసార 2పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దీంతో “సీక్వెల్ నిజంగానే ఉంటుందా?” అనే సందేహాలు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి.
ఇటీవల కళ్యాణ్ రామ్ ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడంతో ఈ ప్రశ్నలు మరింత బలపడ్డాయి. తాజా సమాచారం ప్రకారం, బింబిసార 2 విషయంలో టీమ్ ఎలాంటి తొందరపడటం లేదట. పీరియాడిక్ ఫాంటసీ కావడంతో కథ మొదటి భాగాన్ని మించి ఉండాలని, స్క్రిప్ట్ పూర్తిగా సంతృప్తికరంగా సిద్ధమయ్యే వరకూ వేచి చూడాలని మేకర్స్ భావిస్తున్నారట. కళ్యాణ్ రామ్‌కూ ఈ సీక్వెల్‌పై ప్రత్యేకమైన అంచనాలు ఉండటంతో, బలమైన కథ లేకుండా ముందుకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్.
మొత్తానికి, బింబిసార క్రియేట్ చేసిన హైప్‌ను ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఏ మాత్రం తగ్గలేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అధికారిక అప్డేట్ వచ్చే వరకు అభిమానులు ఓపిక పట్టాల్సిందే. అయితే సరైన కథ సిద్ధమైతే, బింబిసార 2 మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పొచ్చు.