చాలా రోజుల గ్యాప్ తర్వాత అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో, అంతకుముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుందని వార్తలొచ్చాయి. తమిళంలో కూడా ఆమె సినిమాలు చేస్తుండటంతో నిజమేనేమో అనుకున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్ మారిపోయింది అని చెబుతున్నారు. ఆమె స్థానంలోకి కయాదు లోహర్ వచ్చిందట. రీసెంట్‌గా ‘ప్యారడైజ్’ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్న కయాదుకు ఈ సినిమా మంచి అవకాశమే అని చెప్పాలి.
నిజానికి శ్రీలీల కంటే కయాదుకే తమిళంలో ఎక్కువ బజ్ ఉంది. ఇమేజ్ కూడా ఉంది. ఎందుకంటే గతేడాది ‘డ్రాగన్’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కయాదు.. ఆ తర్వాత ‘ఇదయం మురళి’, ‘ఇమ్మోర్టల్’ సినిమాలు చేసి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు కూడా ఆమె కోలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి సూర్యతో నటిస్తోంది. ఇప్పుడు అజిత్ సినిమా ఛాన్స్ కూడా రావడంతో కోలీవుడ్‌లో ఆమె కెరీర్‌కి పెద్ద మలుపు వచ్చినట్లే అని చెప్పొచ్చు.
ఇక సినిమా విషయానికొస్తే.. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ‘డేర్ డెవిల్’ గురించే ఇదంతా. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తర్వాత వీరి కలయికలో రాబోతున్న చిత్రమిది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది. అందుకోసం అక్కడ ఒక భారీ క్యాసినో సెట్‌ను సిద్ధం చేశారు. సినిమాలోని ప్రధాన సన్నివేశాలను ఈ సెట్‌లోనే చిత్రీకరిస్తారని సమాచారం. సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో హీరోయిన్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
అయితే, ఈ సినిమా నుండి శ్రీలీల ఎందుకు తప్పుకుంది, లేదంటే వద్దనుకున్నారు అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. అయితే హిందీ సినిమాల కారణంగానే ఆమె తమిళ సినిమాకు దూరమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆమె నటిస్తున్న రెండు సినిమాలు చాలా రోజులుగా సెట్స్‌పైనే ఉన్నాయి. అయితే ఆమె ధనుష్‌తో నటించిన ‘ఓం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.