త్రిష విషయంపై స్పందించిన కీర్తి సురేష్!

  • February 6, 2018 / 01:08 PM IST

నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు. వెంటనే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి విజయం సాధించకపోయినప్పటికీ   కీర్తిసురేష్‌ క్రేజ్ మాత్రం పెరిగింది. ప్రస్తుతం ఆమె “మహానటి”లో సావిత్రిగా నటిస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం. దీంతో ఇతర హీరోయిన్స్ ఆమెపై కోపంగా ఉన్నట్లు తెలిసింది. తమ అవకాశాలు కొట్టుకుపోతోందని గుర్రుగా ఉన్నారు. ఈ జాబితాలో త్రిష ముందున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఎందుకో.. వివరాల్లోకి వెళ్లుదాం..  పదమూడేళ్ల క్రితం విడుదలైన సూపర్ హిట్ సాధించిన సామీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది.

అందులో హీరో హీరోయిన్లుగా నటించిన విక్రమ్, త్రిష నే  సీక్వెల్ లోను తీసుకున్నారు. అయితే ఇందులో మరో హీరోయిన్ గా కీర్తి ఎంపికైంది.     సామీ2లో లీడ్ రోల్ కీర్తిసురేష్ కి ఇచ్చారని, ఆమె పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో త్రిష ఈ సినిమా నుంచి బయటికి వచ్చేసిందని టాక్. దీంతో ఈ విషయం కోలీవుడ్ లో చర్చకి దారితీసింది. కీర్తి సురేష్, త్రిష మధ్య గొడవ జరిగిందని రూమర్లు షికారు చేశాయి. దీనిపై తాజాగా కీర్తి సురేష్ స్పందించింది. “నాకు త్రిష తో ఎటువంటి గొడవలు లేవు. ఆమెతోనూ కాదు ఎవరితోనూ లేవు” అని స్పష్టం చేసింది. తన వల్ల త్రిష సినిమా వదిలేసిందనే విషయంలో నిజం లేదని తెలిపింది. తాను ఏ హీరోయిన్ తోనైనా కలిసి నటించేందుకు సిద్ధమేనని చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus