సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించే అవకాశం అతి తక్కువమందికే దొరుకుతుంది. కానీ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీకి తొలి చిత్రంతోనే ఆ ఛాన్స్ దక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ కి జోడీగా నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. “నా మొదటి సినిమానే ఇంతటి ఘనవిజయాన్ని సాధించడం నిజంగా నా అదృష్టం. ఒకప్పుడు బాలీవుడ్లో నటిస్తేనే గుర్తింపు వస్తుందన్న అభిప్రాయం చాలామందిలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. భాష ఏదైనా సినిమా బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ సినిమాలో నటించిన వారికి ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది.
దానికి నేనే పెద్ద ఉదాహరణ. ఈ సినిమాకి ముందు నాగురించి తక్కువమందికి తెలుసు. ఇప్పుడు నేను చాలా మందికి తెలుసు.” అని వివరించింది. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ” ఆయన్ని సూపర్‌స్టార్ అని ఎందుకంటారో, ఆయనతో చేసిన తరువాతే నాకు అర్థమయింది. ఓ షాట్ చేసిన తరువాత దాన్ని సిస్టంలో చూస్తారు. బాగా రాలేదు అనుకుంటే మళ్ళీమళ్ళీ చేస్తూనే ఉంటారు. సినిమా బాగా రావాలన్న తపన ఆయనలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయనతో మరోసినిమా చేయాలన్నది నాకోరిక” అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది.