సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ కనిపెట్టి వాట్సప్ చేసిన వాళ్ళకి కోటి రూపాయల బహుమతి ఇస్తా అంటూ దర్శకుడు పూర్వాజ్ ఇచ్చిన ప్రకటనతో కిల్లర్ సినిమా వార్తల్లో నిలిచింది. ప్రీమియర్ షోలకి జనాలు క్యూ కట్టేలా కూడా చేసింది ఆ ప్రకటన. ఆడియన్స్ కోటి రూపాయల బహుమతి సంగతి పక్కన పెడితే.. మేకర్స్ కి ఈ సినిమా కోట్లు తెచ్చే విధంగా ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి:
కథ: కొన్ని మర్డర్ కేసుల విషయంలో పూర్వాజ్ (పూర్వాజ్) అనే పోలీస్ ఆఫీసర్ తన అసిస్టెంట్ గాయిత్రి మూర్తితో ( అర్చన అనంత్ ) కలిసి దర్యాప్తు చేపడతాడు. ఇందులో సాక్షులైన వారిని పిలిపించి విచారిస్తున్న క్రమంలో.. ఆ మర్డర్లకి ఒకే అమ్మాయి (జ్యోతి పూర్వాజ్) కారణం అని తెలుసుకుంటాడు. అయితే ఒకే అమ్మాయి టెర్రరిస్ట్ గా , రక్తపిశాచి గా, గూఢచారిగా ఎలా మారింది? మరో వైపు కార్తీక్( చంద్రకాంత్) అక్క రాయ్ ఏమైంది? ఆమెకు వచ్చిన ప్రమాదం ఏంటి? ఆమె గతం ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: పూర్వాజ్ డాక్టర్‌గా కాసేపు, పోలీస్‌గా కాసేపు కనిపించి జనాలను కన్ఫ్యూజ్ చేశాడు. ఇతను చూడటానికి కొన్ని యాంగిల్స్‌లో పూరీ జగన్నాథ్‌ను తలపించాడు. కానీ చాలా చోట్ల అవుట్ ఆఫ్ ది బాక్స్ పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్‌ను ఇరిటేట్ చేశాడు. సీరియల్ ఆర్టిస్ట్‌గా, తల్లి పాత్రతో ఫేమస్ అయిన జ్యోతి పూర్వాజ్, ఇందులో అక్క పాత్రలో బాగానే నటించింది. బహుశా ఆమెకు ఫ్యామిలీ ఇమేజ్ ఉండటం వల్ల కావచ్చు. ఆ పాత్ర బాగా సూట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. అయితే టెర్రరిస్ట్‌గా, గూఢచారిగా, రక్తపిశాచిగా ఆమె లుక్స్ సెట్ అవ్వలేదు.
క్లోజప్ షాట్స్‌లో ఆమె ఏజ్ కనిపించేస్తుంది. దానిని కవర్ చేసేందుకు ఓవర్ మేకప్ వేశారు కానీ, కవర్ అవ్వలేదు. చంద్రకాంత్ కొల్లు బాగానే నటించాడు. అయితే ఇతని పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడంతో న్యాచురాలిటీ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మరో సీరియల్ ఆర్టిస్ట్ అర్చన అనంత్ కూడా బాగానే నటించింది. ఇంకా చాలా మంది యూట్యూబ్ యాంకర్లు, పబ్లిక్ టాక్ బ్యాచ్ నటించారు కానీ.. వాళ్ళ పాత్రలు పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు పూర్వాజ్ ఈ సినిమాను కేవలం 25 రోజుల్లో తీశాడట. అందులోనూ రూ.5 కోట్ల బడ్జెట్‌తో కంప్లీట్ చేసినట్టు ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. టీజర్, ట్రైలర్స్‌లోని విజువల్స్ చూస్తే.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నట్టు అనిపించాయి. కానీ సినిమాలో ఆ ఫీల్ కలగలేదు. సినిమాటోగ్రఫీ తప్ప బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా వీక్‌గా ఉంది. పాటలు లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. కథనం విషయానికి వస్తే.. కొన్ని కథలు పేపర్‌పై బాగుంటాయి. కానీ వాటిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో లోపాలు తలెత్తితే అవుట్‌పుట్ తేడా కొట్టేస్తుంది.
ఈ ‘కిల్లర్’ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో మల్టీలేయర్స్తో ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేసి పడేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ గ్లామర్‌కు, తన ఇంటరాగేషన్ ఎపిసోడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవి రెండూ కూడా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. సౌండ్ మిక్సింగ్ కూడా తేడా కొట్టింది. కొందరి వాయిస్‌లు రీ-సౌండ్ వచ్చాయి, అలాగే లౌడ్నెస్ వంటివి డబ్బింగ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండాఫ్ ట్విస్ట్ కనిపెట్టడం అనేది పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్ కొంచెం బెటర్. ఆ ట్విస్ట్ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీని దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. సినిమా రన్‌టైమ్ కూడా తక్కువగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్.
విశ్లేషణ: ‘కిల్లర్’ ఫస్ట్ హాఫ్ అంతా ఒక డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది. అయితే సెకండాఫ్ కొంతవరకు పర్వాలేదు.ఇలాంటి మేధావితనంతో కూడుకున్న సినిమాలని.. థియేటర్లలో అటెన్షన్‌తో ఆడియన్స్ చివరి వరకు ఓపిగ్గా కూర్చోబెట్టడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ప్రీమియర్ షోలకు అంటే కోటి రూపాయల అటెన్షన్ ఉంటుంది కాబట్టి ఓకే..! కానీ రిలీజ్ రోజు నుంచి ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించే కెపాసిటీ అయితే ఈ సినిమాకు లేదు.
ఫోకస్: అటెంప్ట్ కొత్త.. టేకింగ్ పాత
రేటింగ్: 2/5