మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ లాంటి వరుస పరాజయాలు ఆయన మార్కెట్‌పై కాస్త గట్టిగానే ప్రభావం చూపాయి. 2025లో సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన వరుణ్, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju) అనే సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సినిమా ఇది.
‘యూవీ క్రియేషన్స్’ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక గోల్డెన్ బ్యూటీగా పేరొందిన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఇదొక హారర్ కామెడీ జానర్ కావడంతో మొదటి నుంచీ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే సినిమాపై ఎంత బజ్ ఉన్నా, అసలు సిసలు సక్సెస్ అనేది బాక్సాఫీస్ లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది.
ఆ రకంగా చూస్తే బిజినెస్ పరంగా ఈ సినిమా సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ సినిమాకి రూ. 38 కోట్లు బడ్జెట్ పెట్టారు. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 26 కోట్లు రికవరీ అయ్యాయి. అంటే దాదాపు 68% రికవరీ సాధించినట్టు అర్ధం చేసుకోవచ్చు. సో ఇప్పుడు థియేట్రికల్ భారం కేవలం రూ. 12 కోట్లు అనమాట.సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.
కానీ టాక్ ఏమాత్రం తేడా కొట్టినా.. వరుణ్ గత చిత్రాల నెగెటివ్ ఇంపాక్ట్ ఈ సినిమా కలెక్షన్లపై పడే ప్రమాదం కూడా లేకపోలేదు.ఇలాంటి పరిస్థితుల నడుమ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!