సినీ పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిందని చెప్పాలి. విలక్షణమైన కథాంశాలతో, ప్రయోగాత్మక చిత్రాలు తీసి దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు (Singeetam Srinivasa Rao) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్ళు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించినట్లు తెలుస్తోంది. దీంతో యావత్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడిందనే చెప్పాలి. మొదటి నుండీ వినూత్నమైన పద్ధతిలో సినిమాలు చేస్తూ వచ్చారు సింగీతం.
ఆయన గతంలో తీసిన సినిమాలకు జెన్-జీ (Gen-Z) యువతలో సైతం ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. సింగీతం శ్రీనివాసరావు గారి (Singeetam Srinivasa Rao) పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’. ఈ సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. తెలుగు తెరపై వచ్చిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా ‘ఆదిత్య 369’ చరిత్ర సృష్టించింది. టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఆ సినిమా ఇటీవల రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధించింది. అంతేకాకుండా, మాటలు లేకుండా ‘పుష్పక విమానం’ సినిమాను తీసి దాంతో కూడా విజయాన్ని అందుకున్నారు.
విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అన్నిటికీ మించి 94 ఏళ్ల వయసులో కూడా ‘సింగ్ గీతం’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రకంగా చూస్తే సింగీతం శ్రీనివాసరావు గారు (Singeetam Srinivasa Rao) దూరమవ్వడం అనేది యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటుగానే పరిగణించాలి.