న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నవారి అంతు చూసేందుకు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ శ్రమిస్తున్నాడు… తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సాహసం ఇదే. అయితే ఈ కథకు ఏ పేరు పెట్టాలా ? అని డైరక్టర్ బృందం తెగ ఆలోచిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఒకే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తోంది.
ఈ సినిమాకు ఎనిమి, వాస్కోడిగామా, స్టన్ గన్, హంటర్ అనే పేర్లు పెట్టారని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అవి వాస్తవం కావని మురుగదాస్ బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. 1989 లో వచ్చిన అక్కినేని నాగార్జున చిత్రం “శివ” టైటిల్ తో పాటు అభిమన్యుడు అనే పేరును మురుగదాస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండింటిన్లో ఏదో ఒక దానిని త్వరలో ఫిక్స్ చేయనున్నారు. రెండు షెడ్యూల్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ప్రిన్స్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విలన్ గా దర్శకుడు ఎస్.జ్. సూర్య నటిస్తుండడం విశేషం. ఈ సినిమా మూడో షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.